Share News

RSS : కులగణనకు ఓకే

ABN , Publish Date - Sep 03 , 2024 | 02:59 AM

జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కీలక ప్రకటన చేసింది. అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలే తప్ప ‘రాజకీయాంశం’ ఎంతమాత్రం కాకూడదని హితవు పలికింది.

RSS : కులగణనకు ఓకే

  • గణన వివరాలు సమాజ హితానికే ఉపయోగపడాలి

  • ఎన్నికల్లో ప్రచారాంశంగా వాడుకోకూడదు: ఆరెస్సెస్‌

తిరువనంతపురం, సెప్టెంబరు 2: జాతీయ కులగణనకు అనుకూలంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కీలక ప్రకటన చేసింది. అయితే కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలే తప్ప ‘రాజకీయాంశం’ ఎంతమాత్రం కాకూడదని హితవు పలికింది. ఎన్నికల ప్రచారాంశం కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో కులగణన వివరాలు (డేటా) ఉపయోగించకూడని స్పష్టం చేసింది. కులగణన అనేది సున్నితమైన అంశమని, అయితే జాతీయ ఏకీకరణ పరంగా ప్రఽధానమైనదని సంఘ్‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు.

కేరళలోని పాలక్కడ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సమన్వయ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జాతీయ కులగణనపై సునీల్‌ అంబేడ్కర్‌ మాట్లాడారు. ‘హిందూ సమాజంలో కులం, కుల ఆధార సంబంధాలు అనేవి చాలా సున్నితమైన అంశాలు. ఇవి జాతీయ ఐక్యత, సమగ్రతలో అంతర్భాగం. కులగణన వివరాల (డేటా)ను ప్రాథమికంగా సంక్షేమ కార్యకలాపాల కోసం వినియోగించాలే తప్ప రాజకీయాస్త్రం ఎంతమాత్రం కాకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల సంఘ్‌ నేత శ్రీధర్‌ గడ్డ్‌ కులగణన ప్రక్రియ ఓ నిరుపయోగమైన కసరత్తుగా కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో కులగణన ప్రక్రియకు జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల వేదికగా సంఘ్‌ మద్దతు పలకడం గమనార్హం. కాగా రాజ్యాంగపరమైన రిజర్వేషన్లకు ఎప్పుడూ మద్దతిస్తామని సంఘ్‌ పేర్కొంది. బీజేపీతో కొన్ని సమస్యలున్నాయని అంగీకరించిన సంఘ్‌, అవి అంతర్గమైనవేనని, పరిష్కరించుకుంటామని స్పష్టం చేసంది.

Updated Date - Sep 03 , 2024 | 02:59 AM