Share News

Secretary Rajesh Kumar Singh : ఏపీకి 2 పారిశ్రామిక నగరాలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:12 AM

ఏపీలో రెండు కొత్త పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహకం, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు.

Secretary Rajesh Kumar Singh : ఏపీకి 2 పారిశ్రామిక నగరాలు

  • బిహార్‌కు ఒకటి.. మొత్తంగా 12 కొత్త నగరాల ఏర్పాటు

  • ఉపాధి, ఉద్యోగాలకు అవకాశం: డీపీఐఐటీ

న్యూఢిల్లీ, జూలై 26: ఏపీలో రెండు కొత్త పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహకం, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. ఏపీలో రెండు, బిహార్‌లో ఒకటి చొప్పున మొత్తం 12 అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు.

స్వదేశీ ఉత్పత్తులకు భారీ ఊతమిచ్చేలా ఇవి దోహదపడనున్నాయని వివరించారు. ఇప్పటికే యూపీలోని నోయిడా, గుజరాత్‌లోని ధోలెరాలో ఏర్పాటు చేస్తున్న నగరాల మాదిరిగానే కొత్తవి ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

కొత్తగా ప్రకటించిన 12 నగరాల్లో ఇప్పటికే 8 చోట్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటివి జరుగుతున్నాయని పేర్కొన్నారు. ధోరెలా(గుజరాత్‌), ఔరిక్‌(మహారాష్ట్ర), విక్రమ్‌ ఉద్యోగ్‌పురి(మధ్యప్రదేశ్‌), కృష్ణపట్నం(ఏపీ)లో భారీ మౌలిక సదుపాయాలను కల్పించామని, పరిశ్రమలకు భూముల కేటాయింపు కూడా జరుగుతోందని రాజేశ్‌కుమార్‌ వివరించారు.

ప్రస్తుతం బడ్జెట్‌లో ప్రకటించిన 12 నగరాలు, ఇప్పటికే అభివృద్ధి చెందిన 8 నగరాలతో కలిపి మొత్తంగా దేశంలో 20 నూతన పారిశ్రామిక నగరాలు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు.

Updated Date - Jul 27 , 2024 | 03:12 AM