Karnataka: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా?.. సిద్ధూ ఏమన్నారంటే?
ABN , Publish Date - Jul 01 , 2024 | 03:19 PM
సిద్ధరామయ్యను పక్కకుపెట్టి డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
బెంగళూరు: గతేడాది కర్ణాటకలో(Karnataka) అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై చాలా కాలంపాటు సందిగ్ధత ఏర్పడింది. కారణం.. ఆ సీటు కోసం పోటీ పడుతున్న ఇద్దరు బలమైన నేతలు. వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Sidda Ramaiah) మరొకరు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar).
వీరిద్దరు పార్టీని కష్టకాలంలో ఆదుకుని అధికార పీఠానికి చేరువ చేశారు. సీనియారిటీతోపాటు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపింది. అయితే ఈ మధ్య కాలంలో సీఎం మార్పు విషయం మరోమారి కన్నడనాట వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలోనే ఈ విషయం తెగ చక్కర్లు కొడుతోంది. సిద్ధరామయ్యను పక్కకుపెట్టి డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల సమక్షంలో ఇటీవల ఓ స్వామీజీ డీకేను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని కామెంట్స్ చేయడం ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలు మార్పు తథ్యం అనే సంకేతాలు పంపాయి.
స్పందించిన సిద్ధూ..
సీఎం మార్పుపై సీఎం సిద్ధరామయ్యను మీడియా ప్రతినిధులు సోమవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఆ విషయం ప్రజల మధ్య చర్చించాల్సిన వ్యవహారం కాదు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం" అని పేర్కొన్నారు. సిద్ధూ వ్యాఖ్యలతో డీకే శివకుమార్‌కి సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోందనే వాదనకు బలం చేకూరింది. తనను పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలను ఖండించకపోవడం పీఠం మార్పు తప్పదనే సాంకేతాలు ఇస్తోంది.
For Latest News and National News click here