Share News

Raus IAS Study Circle: నరకప్రాయ జీవితం..

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:50 AM

రావూస్‌ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల లేమిపై అవినాశ్‌ దూబే అనే విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ‘

Raus IAS Study Circle: నరకప్రాయ జీవితం..

  • అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్నాం.. వర్షాకాలం నీరు నిలిచిపోతోంది

  • వాన నీటిలో మురుగు కలుస్తోంది.. మౌలిక సౌకర్యాలు ఉండవు.. ఇది అధికారుల నిర్లక్ష్యమే

  • సివిల్స్‌ అభ్యర్థుల మృతి నేపథ్యంలో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టి్‌సకు ఢిల్లీ విద్యార్థి లేఖ

  • విచారణ కమిటీ ఏర్పాటుచేసిన కేంద్రం.. 10 లక్షల పరిహారం.. భవన యజమాని, ఐదుగురి అరెస్ట్‌

  • గ్యాస్‌ చాంబర్లలా కోచింగ్‌ సెంటర్లు: ధన్‌ఖడ్‌.. సివిల్స్‌ అభ్యర్థుల మృతిపై ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రావూస్‌ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల లేమిపై అవినాశ్‌ దూబే అనే విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ‘‘మేం నరకంలో బతుకుతున్నాం’’ అంటూ.. రాజేంద్రనగర్‌, ముఖర్జీనగర్‌ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను తన లేఖలో వివరించాడు. ‘‘సర్‌.. ఏటా రాజేంద్రనగర్‌, ముఖర్జీనగర్‌లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది. మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మేం ఏటా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం.

మోకాలిలోతు డ్రెయినేజీ నీటిలో నడవాల్సి వస్తుంది. వాన నీటిలో మురుగు నీరు కలిసిపోతుంది. ఆ నీరు ఒక్కోసారి ఇళ్లల్లోకి కూడా ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితుల్లో పరీక్షలకు సిద్ధమవుతున్న మాలాంటి విద్యార్థులందరం నరకప్రాయమైన జీవితం గడుపుతున్నాం. ఇక్కడ విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి భద్రతా లేదని నిన్నటి (శనివారంనాటి) ఘటన నిరూపించింది.

ఢిల్లీ ప్రభుత్వం, మునిసిపల్‌ కార్పొరేషన్‌ మమ్మల్ని పురుగుల్లా బతికేలా చేస్తున్నాయి. సర్‌.. ఆరోగ్యకరమైన జీవితం గడుపుతూ చదువుకోవడం మా ప్రాథమిక హక్కు’’ అని దూబే తన లేఖలో పేర్కొన్నాడు. వరద నీటి సమస్య.. కోచింగ్‌ సెంటర్లలో చదువుకుంటున్న విద్యార్థుల భద్రతకే ముప్పుగా పరిణమించిందని ఆవేదన వెలిబుచ్చాడు.

సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు ఎలాంటి భయమూ లేకుండా చదువుకుని, దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయగలుగుతారని అభిప్రాయపడ్డాడు. రాజేంద్రనగర్‌, ముఖర్జీనగర్‌ వంటి ప్రాంతాల్లో వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ప్రజల జీవితం నరకప్రాయం అవుతున్న నేపథ్యంలో.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా సమర్థమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించాలని సీజేఐను దూబే కోరాడు.


విద్యార్థుల మృతిపై విచారణ కమిటీ

రాజధాని ఢిల్లీలో ముగ్గురు సివిల్స్‌ అభ్యర్థుల ప్రాణాలు జలసమాధి అయిన ఘటనపై విచారణకు కేంద్ర హోం శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 30 రోజుల్లోగా దీనిపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఇక, ఈ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించనున్నట్టు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కోచింగ్‌ సెంటర్‌ యజమాని, కో-ఆర్డినేటర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు సోమవారం.. ఆ భవన బేస్‌మెంట్‌ యజమాని సహా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Untitled-2 copy.jpg 1111.jpg

వారిలో ఒక ఎస్‌యూవీ డ్రైవర్‌ కూడా ఉన్నాడు. ప్రమాదానికి కేంద్రమైన రావూస్‌ కోచింగ్‌ సెంటర్‌ ముందు నుంచి శనివారం సాయంత్రం ఆ ఎస్‌యూవీ వేగంగా వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్దయ్యాయి. ఆ వాహన వేగం ధాటికి నీరు అలలుగా వెళ్లి గేటును తాకడంతోఅది విరిగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అతడు తన వాహనాన్ని చాలా వేగంగా నడిపాడని.. ఆ రోడ్డులోకి వెళ్లొద్దంటూ వీధివ్యాపారి ఒకరు వారించినా వినిపించుకోలేదని వారు వెల్లడించారు. ఆ వాహనం వెళ్లకముందు రావూస్‌ స్టడీ సర్కిల్‌ భవనం గేటు బాగానే ఉందని.. వాహన వేగం ధాటికి నీరు ఉధృతంగా చొచ్చుకురావడంతో అది విరిగిపోయిందని వారు వెల్లడించారు. సోమవారం అరెస్ట్‌ చేసిన ఐదుగురినీ కోర్టు ఆగస్టు 12 దాకా జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది.


కాగా.. ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఉన్న అన్ని కోచింగ్‌ సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి.. నిబంధనలు ఉల్లంఘించిన 20 శిక్షణ కేంద్రాల బేస్‌మెంట్లకు సీల్‌ వేశారు. మరోవైపు.. డ్రైనేజీలో పూడిక తీయకుండా, నీళ్లు నిలిచిపోవడానికి కారణమైన జూనియర్‌ ఇంజనీర్‌ను ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. మరో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తానియా సోని, శ్రేయ యాదవ్‌, నెవిన్‌ డెల్విన్‌ మృతదేహాలను వారి కుటుంబసభ్యులు స్వస్థలాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు పరిహారం అక్కర్లేదని.. ఈ విషాదానికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని నెవిన్‌ డెల్విన్‌ తండ్రి విజ్ఞప్తి చేశారు.


సభలో ఎంపీల ఆగ్రహం..

ముగ్గురు విద్యార్థుల మరణంపై పార్లమెంటు ఉభయసభల్లోనూ ఎంపీలు ఆందోళన చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై స్వల్పకాల వ్యవధి చర్చకు అనుమతించిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌.. దేశంలో సివిల్‌ సర్వీస్‌, ఇంజనీరింగ్‌, వైద్య పరీక్షలకు శిక్షణనిచ్చే కేంద్రాలు లాభాలు దండుకునే పరిశ్రమలుగా.. గ్యాస్‌చాంబర్లుగా మారిపోయాయని విమర్శించారు. ఆయా సంస్థలు ప్రకటనలకు చేసే ఖర్చుపైనా విచారణ జరిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Untitled-2 copy.jpg

ఈ అంశంపై చర్చించేందుకు అన్ని పార్టీల నాయకులనూ కలుసుకుంటానని ధన్‌ఖడ్‌ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఉప నేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రావూస్‌ స్టడీ సర్కిల్‌లో ముగ్గురు విద్యార్థుల మరణానికి కారణం కేజ్రీవాల్‌ ప్రభుత్వమేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ తిరుగుబాటు ఎంపీ స్వాతి మలివాల్‌ ధ్వజమెత్తారు. ఆమె వాదనను ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ తోసిపుచ్చారు.


ఢిల్లీలో ఆ కోచింగ్‌ సెంటర్లు పాతికేళ్లుగా ఉన్నాయని.. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే వాటికి అనుమతినిచ్చిందని గుర్తుచేశారు. ఢిల్లీలో అధికారాలన్నీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతుల్లో ఉన్నాయని.. అధికారులెవరూ తమ మాట వినట్లేదని సంజయ్‌సింగ్‌ తెలిపారు. ఇక లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌.. కోచింగ్‌ సెంటర్లు మాఫియాగా మారాయని ఆరోపించారు.

Untitled-2 copy.jpg

ప్రమాదం జరిగిన భవనానికి అగ్నిమాపక శాఖ ఈ నెలలోనే నిరభ్యంతర పత్రం ఇచ్చిన నేపథ్యంలో.. ఆ సర్టిఫికెట్‌ ఇచ్చిన అధికారులను ఈ ఘటనకు బాధ్యులుగా చేయాలని సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పించాలని స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ విషాదానికి ఎవరు బాధ్యత వహించాలనే అంశంపై బీజేపీ, ఆప్‌ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. సోమవారం కొందరు బీజేపీ నేతలు ఢిల్లీలోని ఆప్‌ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆప్‌ నేతలేమో.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.


  • ఫిర్యాదు చేసినా..

నిబంధనల ఉల్లంఘనపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. రావూస్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌తోపాటు మరికొన్ని కోచింగ్‌ సెంటర్లలో బేస్‌మెంట్లలో గ్రంథాలయాలు, తరగతిగదులను ఏర్పాటు చేయడంపై జూన్‌ 26నే తాను అధికారులకు ఫిర్యాదు చేశానని, కానీ ఎవరూ పట్టించుకోలేదని కిశోర్‌ సింగ్‌ కుశ్వాహ అనే సివిల్స్‌ ఆశావహుడు తెలిపారు. ఇక.. ముగ్గురు సివిల్స్‌ అభ్యర్థుల మృతికి నిరసనగా సోమవారం వందలాది మంది విద్యార్థులు రావూస్‌ స్టడీ సర్కిల్‌ వద్ద ఆందోళనకు దిగారు. ‘‘ఇప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతాయి.

Untitled-2 copy.jpg

మరింతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతారు. మమ్మల్ని మేమే కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో దేశానికి ఎలా సేవ చేయగలం? ఇతరుల ప్రాణాలను ఎలా కాపాడగలం’’ అని రాహుల్‌ శర్మ అనే విద్యార్థి ఆగ్రహంగా ప్రశ్నించారు.

విద్యార్థుల నిరసన నేపథ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. విద్యార్థుల మృతికి బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారికి హామీ ఇచ్చారు. కానీ.. విద్యార్థులు శాంతించలేదు. ‘‘మాకు న్యాయం కావాలి’’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘‘పోలీసు బారికేడ్ల వెనకాల నిలబడడం కాదు.. మీరు కూడా ఇటువైపు వచ్చి మాతో కలిసి నిరసన తెలపండి’’ అని సక్సేనాను ఆహ్వానించారు.

Updated Date - Jul 30 , 2024 | 07:31 AM