Share News

Sunita Kejriwal : ఎంపీ మాగుంటది తప్పుడు వాంగ్మూలం

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:42 AM

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే మద్యం కుంభకోణంలో తన భర్తను ఈడీ అరెస్టు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Sunita Kejriwal : ఎంపీ మాగుంటది తప్పుడు వాంగ్మూలం

  • దాని ఆధారంగానే కేజ్రీవాల్‌ అరెస్టు

  • మాట మార్చగానే మాగుంట కొడుక్కు బెయిల్‌

  • వీడియో సందేశంలో సునీతా కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, జూలై 6: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే మద్యం కుంభకోణంలో తన భర్తను ఈడీ అరెస్టు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఆరోపించారు. శనివారం ఓ వీడియో సందేశంలో మాట్లాడిన ఆమె... ఢిల్లీలో ఓ చారిటబుల్‌ ట్రస్టుకు భూ కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రిని కలిశానని మార్చి 16, 2021లో ఈడీకి తెలిపిన శ్రీనివాసులు రెడ్డి... తదనంతరం కుమారుడు మాగుంట రాఘవ అరెస్టయి జైలుకు వెళ్లడంతో మాట మార్చారని పేర్కొన్నారు. స్వయంగా కేజ్రీవాలే పది మంది ముందే తనను లిక్కర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టామని కోరారని, ఆప్‌కు రూ. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని జూలై 17, 2023లో అదే ఈడీకి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. ‘‘అంతమంది ముందు ఎవరైనా డబ్బులు అడుగుతారా?’’ అని ప్రశ్నించారు.

ఆయన అలా మాట మార్చగానే... కుమారుడు రాఘవకు బెయిల్‌ దొరికిందని సునీతా ఆరోపించారు. ఎంపీ మాట మార్చారని దాన్ని బట్టే స్పష్టమవుతోందన్నారు. ఈడీ, సీబీఐలను అడ్డంపెట్టుకొని కేజ్రీవాల్‌ను, ఆమ్‌ ఆద్మీ పార్టీని ప్రధాని మోదీ అంతం చేయాలని చూస్తున్నారన్నారు. సీఎంకు ప్రజలు మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నిజాయితీపరుడు, దేశ భక్తుడైనా కేజ్రీవాల్‌ లాంటి వారికి మద్దతివ్వకపోతే చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి సాహసించరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తిహాడ్‌ జైలులో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మెడికల్‌ రికార్డులను పరిశీలించేందుకు, ఆయన తరపున వైద్యుల్ని సంప్రదించేందుకు సునీతా కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. వైద్య పరీక్షల సమయంలో తన భార్యను అనుమతించాలన్న కేజ్రీవాల్‌ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Updated Date - Jul 07 , 2024 | 03:42 AM