కేజ్రీవాల్‌కు సుప్రీంలో చుక్కెదురు
ABN , Publish Date - Oct 22 , 2024 | 04:06 AM
ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు జారీ అయిన సమన్లను కొట్టేయాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది
పరువు నష్టం కేసుపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, అక్టోబరు 21 : ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు జారీ అయిన సమన్లను కొట్టేయాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో ఆయనపై గుజరాత్ కోర్టులో పరువునష్టం కేసు విచారణ జరగనుంది. ప్రధాని విద్యార్హతలపై కేజ్రీవాల్, ఆప్ నేత సంజయ్ సింగ్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు వారిద్దరికి సమన్లు జారీ చేసింది. కాగా ఆప్ నేత సంజయ్ సింగ్ ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం మరో బెంచ్ ఏప్రిల్ 8న కొట్టేసిన విషయాన్ని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ కేజ్రీవాల్ పిటిషన్ విచారణ సందర్భంగా గుర్తుచేసింది.
కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ... గుజరాత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పటేల్‌కు ఈ వ్యవహారంతో సంబంధం లేదన్నారు. ఒకవేళ ఆప్ నేతల వ్యాఖ్యలు పరువునష్టం కిందకు వచ్చినా... ప్రధాని మోదీ పరువునష్టం కేసు దాఖలు చేయాలిగాని, గుజరాత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కాదన్నారు. కాగా ప్రధాని విద్యార్హతలకు సంబంధించి ఆప్ నేతలు ఇద్దరూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో గుజరాత్ యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకుని పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని రిజిస్ట్రార్ పరువు నష్టం కేసులో పేర్కొన్నారు.