Share News

చైల్డ్‌ పోర్న్‌ చూడడం నేరమే

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:10 AM

చిన్నపిల్లల నీలిచిత్రాలను (చైల్డ్‌ పోర్న్‌) చూడడం, డౌన్‌లోడ్‌ చేసి భద్రపరచుకోవడం పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) చట్టాల కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

చైల్డ్‌ పోర్న్‌ చూడడం నేరమే

  • డౌన్‌లోడ్‌ చేసి భద్రపరచుకోవడమూ

  • పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం శిక్షార్హమే

  • సర్వోన్నత న్యాయస్థానం సంచలనతీర్పు

  • మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేత

  • చైల్డ్‌ పోర్న్‌ డౌన్లోడ్‌ చేసిన యువకుడిపై

  • క్రిమినల్‌ కేసు పునరుద్ధరణకు ఆదేశాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: చిన్నపిల్లల నీలిచిత్రాలను (చైల్డ్‌ పోర్న్‌) చూడడం, డౌన్‌లోడ్‌ చేసి భద్రపరచుకోవడం పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) చట్టాల కింద నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చైల్డ్‌ పోర్న్‌ కంటెంట్‌ను ఇతరులకు పంపించే ఆలోచన లేకుండా కేవలం ఫోన్‌లో భద్రపరచుకోవడం పోక్సో, ఐటీ చట్టాల కింద నేరం కాదంటూ ఈ ఏడాది జనవరిలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఘోర తప్పిదంగా అభివర్ణించింది.

అసలు చిన్నపిల్లల నీలిచిత్రాలను చూడడం అనే చర్యలోనే.. చిన్నపిల్లలను లైంగికంగా వాడుకోవాలన్న కోరిక ఉన్నట్టు స్పష్టం చేస్తూ ఆ తీర్పును తోసిపుచ్చింది. అలాంటి కంటెంట్‌ను తొలగించకపోయినా, దాని గురించి అధికారులకు ఫిర్యాదు చేయకపోయినా.. దాన్ని ఇతరులకు పంపించాలన్న ఆలోచన ఉన్నట్టేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తమిళనాడుకు చెందిన ఎస్‌.హరీశ్‌ (28) అనే వ్యక్తి ఫోన్‌లో చిన్నపిల్లల నీలిచిత్రాలు ఉన్నాయంటూ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 14(1), ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67బి కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. దీనిపై అతడు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం.. చిన్నపిల్లలతో నీలిచిత్రాలను తీసి ఉంటే, చైల్డ్‌పోర్న్‌ను వేరొకరికి పంపిస్తేనే ఐటీ చట్టంలోని 67బి కింద శిక్షార్హులని, అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్‌ 14(1) ప్రకారం లైంగికచర్యలకు పిల్లలను వాడుకుంటే తప్పని.. అంతే తప్ప, చైల్డ్‌పోర్న్‌ను కేవలం చూసినంతమాత్రాన నేరం కాదని పేర్కొంటూ అతడిపై పెట్టిన క్రిమినల్‌ కేసును కొట్టేసింది.


మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై ‘జస్ట్‌ రైట్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయెన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా హరీశ్‌ తరఫు న్యాయవాది.. తమ క్లయింట్‌ వాట్సా్‌పకు ఆ పోర్న్‌ వీడియోలు 2019 జూన్‌ 14న వచ్చాయని, పోక్సో చట్టంలో అలాంటి వీడియోలను కలిగి ఉంటే విధించాల్సిన శిక్షలకు సంబంధించిన సెక్షన్‌ 15ను 2019 ఆగస్టు 16న చేర్చారని.. కాబట్టి ఆ సెక్షన్‌ ప్రకారం తన క్లయింట్‌కు శిక్ష విధించకూడదని వాదనలు వినిపించారు.

ఆ వీడియోలు కూడా.. వాట్సా్‌పలో ఉన్న ‘ఆటో డౌన్‌లోడ్‌’ ఫీచర్‌ కారణంగా అతడి ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయ్యాయి తప్ప, వాటిని వేరొకరికి పంపాలన్న ఆలోచనే హరీశ్‌కు లేదని వివరించారు. ఈ పిటిషన్‌ వేసిన స్వచ్ఛంద సంస్థ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హెచ్‌ఎ్‌స ఫూల్కా.. అతడి ఇంటర్‌నెట్‌ డౌన్‌లోడ్స్‌ను ట్రాక్‌ చేస్తే అప్పటికి (2019 నాటికి) రెండు సంవత్సరాలుగా అతడు చైల్డ్‌ పోర్న్‌ చూస్తున్నట్టు వెల్లడైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలూ విన్న సుప్రీం ధర్మాసనం.. మద్రాస్‌ హైకోర్టు తీర్పును తోసిపుచ్చి, నిందితుడు హరీశ్‌పై పోలీసులు నమోదు చేసిన క్రిమినల్‌ కేసును పునరుద్ధరించాలని ఆదేశించింది.

చైల్డ్‌పోర్న్‌ వీడియోలను వేరొకరి నుంచి అందుకోవడం సెక్షన్‌ 15 ప్రకారం నేరం కాకపోవచ్చుగానీ.. ఆ వీడియోలను వెంటనే డిలీట్‌ చేయకపోవడం, లేదా అధికారులకు దాని గురించి ఫిర్యాదు చేయకపోవడం అంటే నిందితుడికి దురుద్దేశాలున్నాయనడానికి నిదర్శనమని స్పష్టం చేసింది. చైల్డ్‌ పోర్న్‌ సమస్య ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లోనూ వేళ్లూనికుని ఉందని.. భారతదేశంలో ఈ సమస్య ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించిన కోర్టు.. 200 పేజీల తీర్పులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.


  • లైంగిక విద్య తప్పనిసరి..

దేశంలో లైంగిక నేరాల సంఖ్యను తగ్గించాలంటే.. లైంగిక విద్య ప్రయోజనాలపై సమగ్ర అవగాహన కలిగించాల్సిన అవసరం ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైంగిక విద్య, గర్భనిరోధక సాధనాల గురించి చెప్పడం వల్ల యువతలో లైంగిక స్వైర వర్తన, బాధ్యతారహిత ప్రవర్తన పెరిగిపోతాయనే తప్పుడు అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయని.. పిల్లలతో సెక్స్‌ గురించి చర్చించడాన్ని తప్పుగా, అనైతికంగా, ఇబ్బందికరంగా భావిస్తున్నారని ధర్మాసనం ఆవేదన వెలిబుచ్చింది. ఆ అవగాహన లేకపోవడంతో పిల్లలు ఇంటర్‌నెట్‌లో ఎలాంటి వడపోతా లేని, తప్పుదోవ పట్టించే వీడియోలను చూసి అనారోగ్యకరమైన లైంగిక అలవాట్లను ఏర్పరచుకుంటున్నారని.. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని తన 200 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. లైంగిక విద్య అంటే కేవలం పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన అంశాలకే పరిమితమన్న తప్పుడు అభిప్రాయం కూడా చాలా మందిలో ఉందని.. ఆమోదం తెలపడం (కన్సెంట్‌), ఆరోగ్యకరమైన సంబంధాలు, లింగ సమానత్వం, భిన్న అభిప్రాయాలను గౌరవించడం ఇలా చాలా అంశాలు సెక్స్‌ ఎడ్యుకేషన్‌ కిందకే వస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

  • చైల్డ్‌ పోర్న్‌ అనొద్దు.. సీసీమ్‌ అనండి

ఇకపై జ్యుడీషియల్‌ ఆర్డర్లలో, తీర్పుల్లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దని.. దాన్ని ‘చైల్డ్‌ సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేటివ్‌ అండ్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌ (సీఎ్‌సఈఏఎం(సీసీమ్‌))’గా వ్యవహరించాలని దేశంలోని అన్ని కోర్టులకూ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈమేరకు పోక్సో చట్టానికి సవరణ చేయాలని కేంద్రానికి కూడా సూచించింది. సీసీమ్‌ తయారీ క్రమంలో.. చిన్నపిల్లలను కేవలం వస్తువులుగా చూస్తారని, వారిని పెట్టి తీసిన వీడియోలను చూడడంలో అంటే చిన్నపిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించడమేనని జస్టిస్‌ జేబీ పార్దీవాలా పేర్కొన్నారు. సీసీమ్‌ పిల్లల ప్రాథమిక హక్కులకు భంగకరమని.. వారికి ఉన్న ‘హుందాగా జీవించే హక్కు’ను కాలరాస్తుందని అన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 03:10 AM