Share News

Teharan : మూడో ప్రపంచ యుద్ధం.. ముప్పు అంచున?

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:39 AM

చినికి చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా.. ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణ ఇరాన్‌ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది! ఇజ్రాయెల్‌కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా..

Teharan : మూడో ప్రపంచ యుద్ధం.. ముప్పు అంచున?

  • ఇజ్రాయెల్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్‌

  • ఇరాన్‌కు రష్యా.. ఇజ్రాయెల్‌కు అమెరికా, యూకే అండ

  • ‘అబ్రహాం కూటమి’ ఏర్పాటుకు నెతన్యాహు ప్రతిపాదన

  • హెజ్బొల్లా, హౌతీ, హమాస్‌తో ఇరాన్‌ ఏర్పాటు చేసిన

  • ప్రాక్సీ నెట్‌వర్క్‌ను కూటమిగా ఏర్పడి దెబ్బతీసే యోచన

టెహ్రాన్‌, టెల్‌ అవీవ్‌, ఆగస్టు 4: చినికి చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా.. ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణ ఇరాన్‌ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది! ఇజ్రాయెల్‌కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా.. ఇరాన్‌కు సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైనట్టు సమాచారం.

తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్‌.. సోమవారం తమపై యుద్ధానికి దిగే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్‌ అంచనా వేస్తోంది. దీంతో.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరాన్‌ తమ దేశంపై చేసిన దాడిని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జోర్డాన్‌ దేశాల సాయంతో ఎదుర్కొన్నట్టే ఇప్పుడు కూడా అమెరికా, యూకేతో నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు.

ఆయన దీన్ని ‘అబ్రహామ్‌ కూటమి’గా వ్యవహరిస్తున్నారు! 1979లో వచ్చిన ఇస్లామిక్‌ విప్లవం అనంతరం ఇరాన్‌ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి.. లెబనాన్‌లో హెజ్బొల్లా, యెమెన్‌లో హౌతీలు, గాజాలో హమాస్‌, పాలస్తీనియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూపు, ఇరాక్‌లో షియా మిలీషియా గ్రూపులతో ఒక ప్రాక్సీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది.


దాన్ని ‘ద యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ అని పిలుస్తారు. ఈ కూటమిని ఎదుర్కోవాలంటే.. అమెరికా, యూకే వంటి దేశాలతో ‘అబ్రహాం కూటమి’ని ఏర్పాటు చేసి కలిసికట్టుగా పోరాడాలన్నది నెతన్యాహు ఆలోచన. ఈ వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌.. అమెరికా, బ్రిటన్‌ రక్షణ మంత్రులు లాయడ్‌ ఆస్టిన్‌, జాన్‌ హీలేతో ఇప్పటికే మాట్లాడారు.

మరోవైపు.. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ మైకేల్‌ కురిల్లా గల్ఫ్‌ దేశాల నేతలతో చర్చలు జరిపేందుకు అక్కడికి చేరుకున్నారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తన సేనల సంఖ్యను అమెరికా పెంచుతోంది. మరిన్ని విమానవాహక యుద్ధనౌకలను, యుద్ధవిమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నట్టు పెంటగాన్‌ మూడురోజుల క్రితమే ఒక ప్రకటనలో తెలిపింది.

Third-World-War-02.jpg

నాలుగు నెలల క్రితం..

సిరియా రాజధాని డమాస్క్‌సలో ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఇజ్రాయెల్‌ చేసిన బాంబుదాడిలో ఇద్దరు ఇరానియన్‌ జనరల్స్‌ సహా 16 మంది మరణించారు. దీంతో ఇరాన్‌ ఏప్రిల్‌ 13న ఇజ్రాయెల్‌పై 300కు పైగా డ్రోన్లు, క్రూయిజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఇజ్రాయెల్‌ ఆ దాడిని అమెరికా, యూకే, జోర్డాన్‌, ఫ్రాన్స్‌ అండతోనూ, తన యారో-3, డేవిడ్స్‌ స్లింగ్‌ రక్షణ వ్యవస్థలతో సమర్థంగా తిప్పికొట్టింది. అయితే, ఈసారి ఇరాన్‌కు అండగా ఇప్పటికే రష్యా సైనిక విమానాలు ఇరాన్‌లో ల్యాండ్‌ అవుతున్నాయని.. రష్యాకు చెందిన అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్‌ జామింగ్‌ వ్యవస్థను వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో ఇరాన్‌ ఏర్పాటు చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇలా ఇరువైపులా అగ్రరాజ్యాలు రంగంలోకి దిగితే అది మూడో ప్రపంచయుద్ధానికి దారితీయొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, గాజాలో రెండు పాఠశాలలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సేనలు శనివారం చేసిన దాడిలో 25 మంది పాలస్తీనియన్లు చనిపోయారు.


హూతీల దాడులు మళ్లీ ప్రారంభం

యెమెన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభించారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో శనివారం ఓ వాణిజ్య నౌకపై క్షిపణీతో దాడికి పాల్పడ్డారు.

క్షిపణీ దాడి జరిగినట్లు నౌకా భద్రతాధికారి ధ్రువీకరించారని యూకే మేరీటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ వెల్లడించింది. అయితే ఈ దాడి వల్ల నౌకకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపింది. లైబేరియన్‌ జెండాతో యూఏఈ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్న గ్రోటన్‌ నౌకపై ఈ దాడి జరిగినట్లు చెప్పింది.


ప్రపంచ యుద్ధం.. నేడే మొదలు?

  • భారత నోస్ట్రడామ్‌సగా పేరొందిన

  • కుశాల్‌కుమార్‌ తాజా అంచనా

భారత నోస్ట్రడామ్‌సగా పేరొందిన కుశాల్‌కుమార్‌ అనే జ్యోతిష్కుడు.. సోమవారం లేదా మంగళవారం నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ప్రకటించారు. నిజానికి ఈయన మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే తేదీలను ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు.

2024 జూన్‌ 18న మొదలవుతుందని ఒకసారి.. జూలై 26 లేదా 28 తేదీల్లో యుద్ధభేరి మోగుతుందని మరోసారి.. చెప్పారు. కానీ, రెండుసార్లూ ఆయన జోస్యం ఫలించలేదు. హరియాణాకు చెందిన కుశాల్‌కుమార్‌ జ్యోతిష ప్రతిభ ఎంత గొప్పదో తెలియదుగానీ ఆయన చాలా పాపులర్‌. ఆయన వ్యాసాలు అంతర్జాతీయ జ్యోతిష మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.

Updated Date - Aug 05 , 2024 | 08:40 AM