Mujra ramarks: ఒక ప్రధాని మాట్లాడాల్సిన భాషేనా ఇది?.. మోదీకి తేజస్వి ఘాటు లేఖ
ABN , Publish Date - May 26 , 2024 | 06:00 PM
విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్‌లో చేసిన "ముజ్రా'' డాన్స్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖమంత్రి తేజస్వి యాదవ్ స్పందించారు. ''ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సిన భాషేనా ఇది?'' అని నిలదీశారు.
పాట్నా: విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బీహార్‌లో చేసిన "ముజ్రా'' (Mujra) డాన్స్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) స్పందించారు. ''ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సిన భాషేనా ఇది?'' అని నిలదీశారు. ప్రజల ముందు ప్రధాని తప్పుడు, నిరాధార ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఒక లేఖ రాశారు.
ప్రధాని ఎంచుకుంటున్న భాషను ఆ లేఖలో తేజస్వి తప్పుపడుతూ..''ఇవాళ మీరు బీహార్ వచ్చారు. చేయగలిగినన్ని తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారు. మీరు ప్రధాన పదవికి ఏమాత్రం గౌరవం ఇవ్వదలచుకోలేదనే విషయం మీ మాటాల్లో చాలా స్పష్టంగా అర్ధమవుతోంది. ముజ్రా, మంగళసూత్ర వంటి వ్యాఖ్యల ద్వారా మీరు దేశ సమున్నత గౌరవాన్ని కించపరుస్తున్నారు. ఈ తరహా భాష మాట్లాడటం సరైనదో కాదో మీరే నిర్ణయించుకోవాలి'' అని అన్నారు.
ప్రైవేటురంగంలో రిజర్వేషన్లపై నిర్లక్ష్యం..
ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల అంశాన్ని మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ లేఖలో తేజస్వి విమర్శించారు. ''బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లకు చరమగీతం పాడేందుకు మోదీ వినూత్న మార్గంలో వెళ్తున్నారు. ఎందుకంటే రాజ్యాగంలోని 5,6 సెక్షన్ల కింద రిజర్వేషన్లు కేటాయించడం జరుగుతుంది. మీరు రైల్వేలు, ఆర్మీ, ఇతర శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలను రద్దు చేస్తే, రిజర్వేషన్ ఉద్దేశమే తుడిచిపెట్టుకు పోతుంది. అయితే ఈ సీరియస్ అంశం మీ ప్రాధాన్యతాక్రమాల్లో లేదు. ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్లు కల్పించాలని, తద్వారా బహుజనులకు, దళితులు, ఇతర బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగ కల్పించిన హక్కులు లభిస్తాయని మేము అనేక మార్లు పార్లమెంటులోను, రోడ్లపైన, అసెంబ్లీలోనూ మీకు విజ్ఞప్తులు చేశాం'' అని తేజస్వి గుర్తు చేశారు.
Lok Sabha Elections: 'ముజ్రా' డాన్స్ ఇక్కడే జరిగిందా?.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే
బాబాసాహెబ్, బిర్సా ముండా, కాన్షీరాం, మండల్ కమిషన్‌కు బీజీపీ సైద్ధాంతిక శత్రువనే విషయం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు బాగా తెలుసునని తేజస్వి అన్నారు. అవునో కాదో మోదీ చెప్పాలని కోరారు. "గుజరాత్లో ఓబీసీ కేటగిరిలో ఉన్న ముస్లింల లిస్ట్‌ను ఈ లేఖతో నేను జత చేస్తున్నాను. గుజరాత్‌లోని ముస్లిం కమ్యూనిటీ రిజర్వేషన్ పొందిన విషయం బహుశా మీరు మరిచిపోయి ఉంటారు. 43 ఏళ్లకు పైగా గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు గందరగోళ, విద్వేష రాజకీయాలకు స్వస్తి చెప్పాలి'' అని తేజస్వి ఆ లేఖలో సూచించారు.
దళిత వ్యతిరేక భావజాలం..
ప్రధాన మంత్రి మోదీ దళిత వ్యతిరేక భావజాలంతో వ్యవహరిస్తున్నారని తేజస్వి ఆ లేఖలో ఆరోపించారు. ''బీహార్‌లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో కులగణన (caste survey) చేపట్టాం. దీనిపై వాస్తవం ఏమిటో మీకు తెలుసు. సర్వే వివరాల ఆధారంగా రిజర్వేషన్ పరిధిని మేము 75 శాతానికి పెంచుతూ, దీనిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చమని పదేపదే ముకుళిత హస్తాలతో మిమ్మల్ని వేడుకున్నాం. కానీ, మీరు సహజంగానే వెనుకబడిన, దళిత వ్యతిరేక భావజాలంతో మా విజ్ఞప్తిని కనీసం పరిశీలనార్హంగా కూడా భావించలేదు'' అని మోదీకి రాసిన లేఖలో తేజస్వి పేర్కొన్నారు.
Read National News and Latest News here