Share News

చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:22 AM

అసలే ఆదివారం..పైగా బీచ్‌లో మెగా ఎయిర్‌షో..! ఇంకేముంది ఉదయం 8గంటల నుంచే చెన్నై మెరీనా బీచ్‌కు జనం పోటెత్తారు. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారూ లక్షలాదిగా తరలిరావడంతో బీచ్‌కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి.

 చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం

  • చెన్నై ఎయిర్‌ షోలో అపశ్రుతి.. ఐదుగురి దుర్మరణం

  • 100 మంది ఆస్పత్రి పాలు.. ఎండ వేడి, ఉక్కపోతతో సొమ్మసిల్లిన వైనం

  • ఆదివారం కావడంతో ఉదయం నుంచే ప్రదర్శనకు పోటెత్తిన జనం

  • 15 లక్షల మందికి పైగా రావడంతో జనసంద్రంగా మారిన తీరం

చెన్నై, అక్టోబరు6 (ఆంధ్రజ్యోతి): అసలే ఆదివారం..పైగా బీచ్‌లో మెగా ఎయిర్‌షో..! ఇంకేముంది ఉదయం 8గంటల నుంచే చెన్నై మెరీనా బీచ్‌కు జనం పోటెత్తారు. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారూ లక్షలాదిగా తరలిరావడంతో బీచ్‌కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి. చూస్తుండగానే ఇసుకేసినా రాలనంతగా సుమారు 15లక్షల మంది పోగయ్యారు..! మరోవైపు విపరీతమైన ఎండ.. భరించలేని ఉక్కపోత.. సరిగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి..! ఈ పరిస్థితుల్లో ఎయిర్‌షో ప్రారంభమైన కొద్దిసేపటికే చూస్తుండగానే సుమారు 230 వరకూ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వైద్య సిబ్బంది కొందరికి అక్కడే చికిత్స అందించారు. సుమారు వంద మందిని మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో ఓమండూరార్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వంద మంది వరకూ చికిత్స పొందుతున్నారు.

ఎయిర్‌షో మధ్యాహ్నమే ముగిసినప్పటికీ.. జనం లక్షలాదిగా తరలిరావడంతో ట్రాఫిక్‌ సాయంత్రం వరకూ కొనసాగింది. సొమ్మసిల్లి పడిపోయినవారిని అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది. బీచ్‌ సమీపంలోని లైట్‌హౌస్‌ మెట్రో స్టేషన్‌, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టీఎస్‌ రైల్వేస్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. కాగా, అంతకుముందు మీడియాలో మెరీనా బీచ్‌ వద్ద తొక్కిలాట జరిగినట్టు వదంతులు వ్యాపించడంతో ఒకింత ఆందోళన నెలకొంది. ఎయిర్‌షోకు లక్షలాదిమంది వస్తారని తెలిసినా... డీఎంకే ప్రభుత్వం తగిన వసతులు కల్పించకపోవడం వల్లే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి డి. జయకుమార్‌ ఆరోపించారు. వారి మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.


  • కన్నులపండువగా ఎయిర్‌ షో

భారత వైమానిక దళం 93వ ఏట అడుగిడిన సందర్భంగా చెన్నై మెరీనా తీరంలో ఆదివారం నిర్వహించిన విన్యాసాలు కన్నుల పండుగలా సాగాయి. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు సుమారు 15 లక్షల మందికిపైగా తరలివచ్చారు. దీంతో ఇదొక ప్రపంచ రికార్డుగా ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది. ఆదివారం 11 గంటలకు ప్రారంభమైన ఈ విన్యాసాలు రెండు గంటలపాటు చూపరులను కట్టిపడేశాయి. తొలుత ఎం17 రకానికి చెందిన రెండు హెలికాప్టర్లు మెరుపువేగంతో ఆకాశంలో చక్కర్లు కొట్టాయి.

ఆ తర్వాత ఆకాశ్‌గంగా బృందం సభ్యులు ఉగ్రవాదుల నుంచి బందీలను విడిపించే విన్యాసాన్ని ప్రదర్శించారు. ఆరుగురు వీరులు పారాచూట్ల సాయంతో 2వేల అడుగుల ఎత్తు నుంచి జాతీయ పతకాన్ని చేతపట్టుకుని కిందకు దూకడం విస్మయపరచింది. రఫేల్‌, హార్వర్డ్‌, తేజస్‌, మిగ్‌ రకం యుద్ధ విమానాలతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. త్వరలో వైమానిక దళంలో చేరనున్న హెచ్‌టీటీ 40 రకం విమానం చేసిన విన్యాసం కూడా చూపరులను మైమరపించింది. ఈ విన్యాసాలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్‌, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, వైమానిక దళం ఉన్నతాధికారి చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ ప్రత్యేక వేదికపై నుంచి తిలకించారు.

Updated Date - Oct 07 , 2024 | 03:22 AM