ఆప్‌ను వీడిన రవాణా మంత్రి కైలాష్ గెహ్లోత్
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:36 AM
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోత్ తన మంత్రి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఎన్నికల వేళ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ, నవంబరు17: ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోత్ తన మంత్రి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అతి త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గెహ్లోత్ రాజీనామా చేయడం సంచలనంగా మా రింది. రాజీనామాకు ఆయన చెప్పిన కారణాలు కలకలం రేపాయి. ఓ పక్క ఆమ్ ఆద్మీ(సామాన్యుడు) సంక్షేమమే లక్ష్యమంటూ మరోపక్క 45 కోట్ల రూపాయల ఖర్చుతో సీఎం అధికారిక నివాసాన్ని శీశ్‌మహల్ తరహాలో పునర్‌నిర్మించారని ఆయన విమర్శించారు. యమునా నది శుద్ధిని గాలికి వదిలేశారని గెహ్లోత్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన ఆప్ తన లక్ష్యానికి దూరంగా జరిగిపోయిందని, తానిక పార్టీతలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రాశారు. కైలాష్ గెహ్లోత్ రాజీనామా బీజేపీ కుట్ర ఫలితమేనని ఆప్ ఆరోపించింది. గెహ్లోత్‌పై ఐటీ, ఈడీ వంటి సంస్థలను ఉసిగొల్పి దాడులు చేయించిందని, మరో మార్గంలేక ఆయన బీజేపీలో చేరబోతున్నారని ఆరోపణలు చేసింది. కైలాష్ గెహ్లోత్ బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఢిల్లీ బీజే పీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కేజ్రీవాల్ విధానాలు నచ్చి ఆప్‌లో చేరుతున్నట్లు ఝా చెప్పారు.