Share News

Tuberculosis : రూ.35కే క్షయ నిర్ధారణ పరీక్ష

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:24 AM

ప్రపంచానికి సవాలు విసురుతున్న రోగాల్లో క్షయ ఒకటి. దీని నిర్ధారణ ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుతం సాంప్రదాయ పద్ధతుల ద్వారా టీబీని నిర్ధారించడానికి 42 రోజులు పడుతోంది.

Tuberculosis : రూ.35కే క్షయ నిర్ధారణ పరీక్ష

  • కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్‌

  • మూడు దశల్లో వ్యాధి నిర్ధారణ

  • రెండున్నర గంటల్లో 1500 శాంపిల్స్‌ పరీక్ష

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్రపంచానికి సవాలు విసురుతున్న రోగాల్లో క్షయ ఒకటి. దీని నిర్ధారణ ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుతం సాంప్రదాయ పద్ధతుల ద్వారా టీబీని నిర్ధారించడానికి 42 రోజులు పడుతోంది.

అయితే కేవలం రూ.35 ఖర్చుతోనే రోగి కఫాన్ని పరీక్షించి క్షయ వ్యాధిని నిర్ధారించే కొత్త సాంకేతిక వ్యవస్థను ఐసీఎంఆర్‌కు చెందిన అసోంలోని డిబ్రూగఢ్‌ ప్రాంతీయ కార్యాలయం అభివృద్ధి చేసింది. ‘సీఆర్‌ఐఎ్‌సపీఆర్‌ కేస్‌-బేస్డ్‌ టీబీ డిటెక్షన్‌ సిస్టమ్‌’ అని పిలిచే ఈ చిన్న పరికరం చాలా తేలికైంది. మూడు దశల్లో క్షయ నిర్ధారణ చేసే ఈ పరికరంతో రెండున్నర గంటల్లో ఏకబిగిన 1,500 శాంపిల్స్‌ను పరీక్షించవచ్చని ఐసీఎంఆర్‌ వర్గాలు తెలిపాయి.


ఇప్పటికే ఉన్న కొన్ని టీబీ నిర్ధారణ పద్ధతులు మెరుగైన ఫలితాలను అందిస్తున్నా సమయం, ఖర్చు ఎక్కువగా ఉంటోందని ఐసీఎంఆర్‌ అధికారి ఒకరు చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే సీఆర్‌ఐఎ్‌సపీఆర్‌-కే్‌స12ఏ ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థ మంచి పరిష్కారాన్ని అందిస్తుందన్నారు.

దీనికి విస్తృత మార్కెట్‌ను కల్పించేందుకు అర్హులైన సంస్థలు, కంపెనీలు, తయారీదారులకు ఈ టెక్నాలజీని బదిలీ చేయాలని ఐసీఎంఆర్‌ భావిస్తోంది. ఆసక్తి ఉన్న కంపెనీలు, సంస్థలు ముందుకురావాలని ఆహ్వానించింది. వీటి తయారీకి ముందుకొచ్చే సంస్థలకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకత్వం,సాంకేతిక సహకారం అందిస్తుందని ఆ అధికారి తెలిపారు.

Updated Date - Aug 27 , 2024 | 04:24 AM