Mumbai: ఫడ్నవిస్‌ను ఉద్ధవ్ థాకరే కలిశారంటూ ఆసక్తికర ప్రచారం
ABN , Publish Date - Oct 21 , 2024 | 05:30 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' కూటమి పొత్తుల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) 'మహా వికాస్ అఘాడి' (MVA) కూటమి పొత్తుల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతుండటంతో తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఎంవీఏలో కీలక పార్టీగా ఉన్న శివసేన (UBT) సారథి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis)ను కలుసుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ముంబై వచ్చినప్పుడు థాకరే, ఫడ్నవిస్ సమావేశమైనట్టు ఈ కథనాల సారాంశం. ఈ ప్రచారాన్ని శివసేన యూబీటీ కీలక నేత సంజయ్ రౌత్ ఆదివారంనాడు తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మహారాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని త్యాగాలకు సిద్ధం కావాలంటూ ఎంవీఏ పొత్తుల్లో తలెత్తిన ప్రతిష్ఠంభనపై పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
India-China: సరిహద్దుల వివాదంలో కీలక పురోగతి.. భారత్-చైనా మధ్య ఒప్పందం
త్యాగాలకు సిద్ధపడాలి..
ఎంవీఏ మధ్య సీట్ల షేరింగ్‌పై రౌత్ మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరూ కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి. ఒక అడుగు వెనక్కి వేయాలి'' అని అన్నారు. చాలా ఏళ్లుగా తామంతా రాజకీయాల్లో ఉన్నామని, అందువల్లే ప్రతి పార్టీ తమ కార్యకర్తలను అభ్యర్థులుగా నిలబెట్టాలని అనుకుంటుందని అన్నారు. అయితే ఇప్పుడు కూటమిగా ఏర్పడినందున, ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుందని, అయితే సీట్ల షేరింగ్ విషయానికి వచ్చేసరికి కొన్ని సర్దుబాట్లు, త్యాగాలు చేయాల్సి వస్తుందన్నారు. దేశం కోసం, మహారాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను ఓడించాలనే కారణంతోనే గత ఎన్నికల్లో (లోక్‌సభ) సీట్ల షేరింగ్ విషయంలో తాము పెద్దమనసు చూపించామని చెప్పారు. ''ఇవాళ మహారాష్ట్రలో మమ్మల్ని అధికారంలోంచి తొలగించారు. అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉంది" అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్ల కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..