కర్ఫ్యూ ఉల్లంఘించి అల్లర్లు
ABN , Publish Date - Nov 19 , 2024 | 02:18 AM
మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు సోమవారం కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు.
మణిపూర్‌లో మరింత క్షీణించిన పరిస్థితి
ప్రభుత్వ ఆఫీసులకు నిరసనకారుల తాళాలు
మణిపూర్‌కు అదనంగా 5 వేల బలగాలు
ఇంపాల్, న్యూఢిల్లీ, నవంబరు 18: మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత క్షీణించింది. నిరసనకారులు సోమవారం కర్ఫ్యూను ఉల్లంఘించి యథేచ్ఛగా అల్లర్లకు పాల్పడ్డారు. జిరిబమ్ జిల్లాలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లల హత్యకు నిరసనగా కొకొమి(కోఆర్డినేషన్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ) గ్రూపునకు చెందిన కొందరి నేతృత్వంలో జనం ఇంపాల్ పశ్చిమ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జిరిబమ్ జిల్లాలో హత్యకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ నిరసనకారులు ఇంపాల్‌లోని చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయి ప్రధాన గేటుకు తాళం వేశారు. సమీపంలోని పలు కార్యాలయాలకు ఇదేవిధంగా తాళాలు వేశారు. అలాగే కుకి మిలిటెంట్లపై సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంపాల్‌లో కొకొమి చేపట్టిన ధర్నా మూడోరోజుకు చేరుకుంది. మరోవైపు మణిపూర్ ప్రభుత్వం సోమవారం నుంచి బుధవారం వరకు ఏడు జిల్లాల్లో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వరుసగా రెండోరోజు మణిపూర్‌పై కేంద్ర, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మరో 5 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని ఆ రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంపై దృష్టి పెట్టి వెంటనే అక్కడ శాంతి భద్రతలను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇప్పటికే సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏడీ సింగ్, ఇతర కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంలో మకాం వేసి ఉన్నారు.
గత వారం పంపిన కేంద్ర సిబ్బందితో కలిపి మొత్తం 218 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. కాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మణిపూర్‌లో తాజాగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి మూడు కేసులను నమోదు చేసింది. జిరిబమ్ జిల్లాలో మహిళల హత్య.. సీఆర్‌పీఎఫ్ పోస్టుపై సాయుధ మూక దాడి.. బొరొబెక్రలో ఇళ్ల దహనం, ఒకరి హత్యకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాక ముందే ప్రధాని మోదీ కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో పర్యటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మణిపూర్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని కోరింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ కె. మేఘచంద్ర సింగ్, ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్‌లతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నవంబరు 25న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందే ఆ రాష్ట్రంపై జాతీయ స్థాయిలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 31 నుంచి మణిపూర్‌కు పూర్తిస్థాయి గవర్నర్ కూడా లేరని పేర్కొన్నారు. పాలనలో విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని హోం మంత్రి ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు.