Share News

Viral News: బాధితులను కాపాడిన వయనాడ్ సూపర్ హీరో గల్లంతు.. తిరిగివస్తాడా?

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:33 PM

సూపర్ హీరోలను సినిమాల్లో చూసే ఉంటాం. వాళ్లంతా రీల్ హీరోలైతే.. ఆపద సమయాల్లో ఆదుకుంటూ కొందరు రియల్ సూపర్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు ప్రజీష్ అనే యువకుడు.

Viral News: బాధితులను కాపాడిన వయనాడ్ సూపర్ హీరో గల్లంతు.. తిరిగివస్తాడా?

వయనాడ్: సూపర్ హీరోలను సినిమాల్లో చూసే ఉంటాం. వాళ్లంతా రీల్ హీరోలైతే.. ఆపద సమయాల్లో ఆదుకుంటూ కొందరు రియల్ సూపర్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు ప్రజీష్ అనే యువకుడు. కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికిపైగా ప్రజలు మరణించగా, వందకుపైగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే కొండల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా, యువత చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటోంది.

వీరంతా బాధితులను రక్షించి పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. అయితే బాధితులను రక్షించేందుకు వెళ్లి ప్రజీష్ అనే కుర్రాడు తప్పిపోయాడు. అప్పటికే తన జీపులో రెండు సార్లు బాధితులను ఎక్కించుకుని పునరావాస కేంద్రాలకు తరలించగా.. మూడోసారి సాయం చేసేందుకు వెళ్లిన అతని ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.


ప్రజీష్ స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. వయనాడ్ జిల్లా చూరాల్‌మలో ప్రజీష్ అనే యువకుడు నివసిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తోటివారు కష్టా్ల్లో ఉంటే ఆదుకోవాలనే మనస్తత్వం అతనిది. జులై 30 తెల్లవారుజామున ముండక్కై, చూరాల్‌మల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని తెలియగానే తోటి స్నేహితులతో ప్రజీష్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకునేలోపే అతను రంగంలోకి దిగాడు. కొండల్లో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు ప్రమాదకర కొండ ప్రాంత మార్గంలో జీప్‌లో వెళ్లారు. అలా రెండుసార్లు పదుల సంఖ్యలో బాధితులను కాపాడగలిగాడు.


మూడోసారి కొండపైకి.. కానీ..

అంతా అయిపోయిందనుకున్న సమయానికి పక్కనే ఉన్న మరో కొండలో ఇంకెవరో చిక్కుకున్నారనే సమాచారం వచ్చింది. వారికి రక్షించేందుకు సిద్ధమయ్యాడు. మళ్లీ తన జీప్‌లోనే కొండపైకి వెళ్లాడు. రిస్క్ చేసి వెళ్లిన ప్రజీష్ తిరిగి రాలేదని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రజీష్ అంటే మా అందరికీ ఇష్టం. మా ఇళ్లలో ఏ కార్యక్రమమైనా ముందుండి తనవంతు సహకారం అందిస్తాడు. నా కుమార్తె పెళ్లికి అతను చేసిన సహాయం మరువలేనిది’’ అని ఓ స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ప్రజీష్ జీప్ తుక్కుగా మారి చూరల్‌మలలో ఓ చెట్టు పక్కన ఉన్నట్లు గుర్తించారు.


కానీ జీపులో అతని జాడ కనిపించకపోవడంతో ప్రజీష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "ప్రజీష్ మా నేలకు సూపర్ హీరో.. కానీ ఇప్పుడు అతన్ని కోల్పోయాం" అని ఓ గ్రామస్థుడు భావోద్వేగానికి గురయ్యాడు. కాగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆదివారం సాయంత్రం వరకు 222 మృతదేహాలను బయటకి తీశారు. ఇంకా ఆచూకీ లభించని వారి సంఖ్య 200 వరకు ఉంటుందని అంచనా.

For Latest News and National News click here

Updated Date - Aug 05 , 2024 | 04:34 PM