Share News

పాంక్రియాస్‌: క్లోమం ఇలా క్షేమం

ABN , Publish Date - May 21 , 2024 | 01:49 AM

పొట్ట నొప్పి సర్వసాధారణమే! అలాగని నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూపోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు. క్లోమగ్రంథి సమస్య అలాంటిదే!

పాంక్రియాస్‌: క్లోమం ఇలా క్షేమం

పాంక్రియాస్‌

పొట్ట నొప్పి సర్వసాధారణమే! అలాగని నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూపోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు. క్లోమగ్రంథి సమస్య అలాంటిదే! తప్పుదోవ పట్టించే లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రతించి సమస్యకు తగిన చికిత్స తీసుకోవాలంటున్నారు వైద్యులు.

ఇన్సులిన్‌ ఉత్పత్తి సవ్యంగా జరగానికీ, ఆహారం జీర్ణించుకోడానికి అవసరమైన ఎంజైముల స్రావానికీ పాంక్రియాస్‌ త్పోడుడుతూ ఉంటుంది. కానీ పాంక్రియాస్‌ జబ్బు పడినప్పుడు బయల్పడే లక్షణాలు తప్పుదారి పట్టించేలా ఉండడం, క్లోమ గ్రంథి పొట్టలో అంతర్గత అవయవాల అడుగున ఉండడం వల్ల, స్కాన్‌లలో ఈ గ్రంథిని స్పష్టంగా కనిపెట్టలేకపోవడం వల్ల ఈ గ్రంథి సమస్యలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి.

అలాగే క్లోమ గ్రంథికి కేన్సర్‌ సోకినప్పుడు, దాని పక్కన ఉండే రక్తనాళాలన్నీ ఇన్వాల్వ్‌ అయి ఉండడం మూలంగా చివరి దశలో సమస్యను కనిపెట్టినప్పటికీ సర్జరీ చేయలేని పరిస్థితి ఉంటుంది.

అయితే సాధారణంగా పాంక్రియాస్‌ సమస్య అక్యూట్‌, క్రానిక్‌ అనే రెండు దశల్లో బయల్పడుతూ ఉంటుంది. ఈ రెండు సమస్యల్లో పాంక్రియాస్‌లో వాపు కనిపిస్తుంది. మద్యపానం, గాల్‌ స్టోన్స్‌ ఈ వాపుకు ప్రధాన కారణాలు. ట్రైగ్లిజరైడ్స్‌, క్యాల్షియం మోతాదులు ఎక్కువగా ఉన్నా, పుట్టుకతో డక్టల్‌ అబ్నార్మాలిటీ ఉన్నా, జన్యుపరమైన సమస్యలు ఉన్నా పాంక్రియాస్‌లో వాపు వస్తుంది.


  • ఆ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు

పాంక్రియాస్‌ వాపులో వచ్చే 80 శాతం అటాక్స్‌ ప్రారంభంలో తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. మిగతా 20ు అటాక్స్‌ తీవ్రంగా ఉంటాయి. ఈ అటాక్స్‌ పొట్టలో నొప్పితో మొదలవుతాయి. బొడ్డు పైభాగంలో మొదలయ్యే నొప్పి వెన్నులోకి పాకుతూ ఉంటుంది.

అక్యూట్‌ పాంక్రియటైటిస్‌లో ఈ నొప్పి అప్పుడప్పుడూ వేధిస్తూ ఉంటే, క్రానిక్‌ దశకు చేరుకున్న తర్వాత, నొప్పి సంవత్సరాల తరబడి వేధిస్తూ ఉంటుంది. భోజనం తిన్న తర్వాత నొప్పి పెరుగుతూ ఉంటుంది.

క్లోమ గ్రంథిలో గడ్డలు (కేన్సర్‌) ఏర్పడినప్పుడు, కామెర్లు, మధుమేహం తలెత్తుతాయి. బరువు కోల్పోతారు. అలాగే మలంలో కొవ్వు పోతూ ఉంటుంది.

పాంక్రియాస్‌ స్రావాలు తగ్గడం వల్ల ఆహారంలో ఉండే కొవ్వులు జీర్ణం అవకుండా, మలం ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. మలవిసర్జనకు వెళ్లినప్పుడు కొవ్వులు నీళ్లలో తేలుతూ ఉండడం, నీళ్లు కొట్టినా మలం తేలికగా వదలకపోవడం లాంటివి కనిపిస్తాయి.

  • క్రానిక్‌ దశ ప్రమాదకరం

క్రానిక్‌ దశలో పాంక్రియాటిక్‌ డక్ట్‌లో రాళ్లు చేరతాయి. ఇందుకు ప్రధాన కారణం మద్యపానం, ధూమపానం. మన దేశంలో ట్రాపికల్‌ పాంక్రియటైటిస్‌ సర్వసాధారణం.

20 ఏళ్ల వయస్కుల్లో కనిపించే ఈ సమస్యలో పాంక్రియాటిక్‌ డక్ట్‌లో రాళ్లు చేరి, నొప్పి వేధిస్తుంది. ఆ నొప్పిని తగ్గించుకోవడం కోసం పెయిన్‌కిల్లర్స్‌ (ఒపియాయిడ్‌ అనాల్జెసిక్స్‌) వాడుతూ, వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు.

ఈ అలవాటు అడిక్షన్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఇలా దీర్ఘకాలంలో పాంక్రియాస్‌ దెబ్బతిని, ఇన్సులిన్‌ ఉత్పత్తి ఆగిపోయి, మధుమేహం కూడా తలెత్తుతుంది. ఇలా జగరకుండా ఉండాలంటే నొప్పి మొదలైన వెంటనే వైద్యులను కలిసి, సమస్య తీవ్రతను అంచనా వేసి, చికిత్స తీసుకోవాలి.

  • చికిత్స ఇలా...

పాంక్రియాస్‌ పొట్టలో అడుగున ఉంటుంది కాబట్టి అలా్ట్రసౌండ్‌లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. కాబట్టి పాంక్రియాస్‌ సమస్యలను స్పష్టంగా తెలుసుకోవడం కోసం సిటి స్కాన్‌ లేదా ఎమ్మారై చేయించాలి. పాంక్రియాస్‌ సమస్యను మరింత కచ్చితంగా నిర్థారించుకోవడం కోసం, నోటి ద్వారా పొట్టలోకి గొట్టం పంపించి, పాంక్రియాస్‌ను దగ్గరగాపరీక్షించవచ్చు.


పరీక్షలో రాళ్లు ఉన్నట్టు తేలితే ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. కొందర్లో సిస్టులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు సర్జరీ చేసి పాంక్రియాస్‌ను తెరిచి, రాళ్లను తొలగించి, చిన్నపేగుకు జాయిన్‌ చేయవలసి ఉంటుంది.

ప్రస్తుతం ఈ సర్జరీ కూడా కీహోల్‌ ద్వారా చేయగలిగే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌ గాల్‌ స్టోన్స్‌ వల్ల తలెత్తితే, గాల్‌ స్టోన్స్‌ను తొలగిస్తే సమస్య సర్దుకుంటుంది. మద్యపానం వల్ల అక్యూట్‌ పాంక్రియటైటిస్‌ వస్తే, ఆ అలవాటు వెంటనే మానుకోవాలి. మానుకోకపోతే సమస్య క్రానిక్‌ దశకు చేరుకుంటుంది.

క్రానిక్‌ దశకు చేరుకున్న కొందర్లో క్లోమానికి రక్తప్రసరణ పూర్తిగా పోయి, క్లోమంలో కొంత భాగం కుళ్లిపోయి, ఇన్‌ఫెక్షన్‌ మొదలవుతుంది. ఇలాంటప్పుడు సర్జరీతో కుళ్లిపోయిన భాగాన్ని తొలగించుకోవాలి.

మహిళల్లో...

మధ్య వయసు మహిళల్లో, యువతుల్లో క్లోమగ్రంథిలో సిస్టిక్‌ ట్యూమర్లు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని ఒకసారి తొలగిస్తే, రెండోసారి తలెత్తవు. ఇవి ప్రమాదకరమైనవి కాకపోయినా, భవిష్యత్తులో కేన్సర్‌గా మారే అవకాశాలుంటాయి. కాబట్టి వీటిని కూడా వెంటనే తొలగించుకోవాలి.

Untitled-5 copy.jpg

క్లోమంలో కేన్సర్‌

క్రానిక్‌ పాంక్రియటైటిస్‌ సమస్య దీర్ఘకాలంలో కేన్సర్‌గా పరిణమించే ప్రమాదం ఉంది. మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్న వాళ్లకు కూడా కేన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది. కొందర్లో జన్యుపరమైన సమస్యల వల్ల కూడా క్లోమ కేన్సర్‌ తలెత్తవచ్చు. అయితే అన్ని కేన్సర్‌లలో పాంక్రియాటిక్‌ కేన్సర్‌ అత్యంత ప్రమాదకరమైనది. ఈ కేన్సర్‌ వేగంగా వృద్ధి చెందడంతో పాటు, రోగి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి క్లోమ కేన్సర్‌ ప్రాణాంతకం కాకుండా ఉండడం కోసం తొలి దశల్లోనే వ్యాధిని గుర్తించాలి. కాబట్టి మధుమేహం, కామెర్లు నిర్థారణ అయినప్పుడు, వాటి కోసమే మందులు వాడుకోవడమే కాకుండా, ఒకసారి స్కాన్‌ చేయించుకుని పాంక్రియాస్‌ పరిస్థితిని తెలుసుకోవాలి.

కేన్సర్‌ అని నిర్థారణ అయినప్పుడు బయాప్సీ చేసి, జెనెటిక్‌ అనాలసిస్‌ చేయించి, టార్గెటెడ్‌ థెరపీ ద్వారా వ్యాధిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ నాల్గవ దశ కేన్సర్‌ నిర్థారణ అయినప్పుడు, సర్జరీకి ముందు కీమోథెరపీ ఇచ్చి, తర్వాత సర్జరీ చేయవలసి ఉంటుంది. తొలి దశ కేన్సర్‌కు సర్జరీ, తర్వాత కీమో అవసరమవుతాయి.

డాక్టర్‌ టి.ఎల్‌.వి.డి. ప్రసాద్‌ బాబు

సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ బేరియాట్రిక్‌ సర్జన్‌,

యశోద హస్పిటల్స్‌,

సికింద్రాబాద్‌.

Updated Date - May 21 , 2024 | 02:16 AM