Share News

NRI: అనేక మందికి ఆపన్నహస్తం అందించి.. చివరకు అచేతనంగా మాతృభూమికి..!

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:08 PM

గల్ఫ్‌లో అనేక కష్టాలు పడ్డ తెలుగు వ్యక్తి త్రిమూర్తులు తొటి ఎన్నారైల సాయంతో ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు.

NRI: అనేక మందికి ఆపన్నహస్తం అందించి.. చివరకు అచేతనంగా మాతృభూమికి..!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దేశం కానీ దేశంలో అనేక మంది తోటి తెలుగువాళ్లు తనకు వీలయిన విధంగా తోడ్పాటునందించిన ఒక తెలుగు ప్రవాసీని అందరూ మరిచిపోయారు. అనారోగ్యంతో కదలలేని దయనీయ స్థితిలో ఆయన స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.

కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పోతవరం గ్రామానికి చెందిన మెట్టపార్ధి త్రిమూర్తులు సుదీర్ఘ కాలంగా సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో పని చేస్తున్నాడు. అరబ్బు మహిళలకు ఆకర్షనీయ ఆధునిక డిజైన్లతో కూడిన దుస్తులు కుట్టడంలో ప్రావీణ్యత కల్గిన త్రిమూర్తులు రియాధ్ నగరంలో ఒక ప్రముఖ లేడిస్ టైలర్‌గా గుర్తింపు పాందాడు. టైలరింగ్ వ్యాపారంలో రాణిస్తూ కొన్ని దుకాణాలు కల్గి ఉండి అన్నీ సజావుగా ఉండి ఆనందమయంగా గడుపుతుండగా కరోనా మహమ్మారి కాటేసింది.

Study abroad: భారతీయుల్లో కెనడాపై అనాసక్తి.. ప్రస్తుతం మనోళ్ల చూపంతా అటే!

కరోనా వలన దుకాణాలన్నీ మూతపడటంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కరోనా కంటే ముందు రాజమండ్రికి చెందిన మరొక టైల‌ర్‌కు ఒక దుకాణం నెలకొల్పగా దాని వీసాలు, దుకాణం అద్దె మొదలగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కోగా త్రిమూర్తులు పూచీ ఉండటంతో అతను స్వదేశానికి వెళ్ళిపోయాడు. కానీ అతనికి పూచీగా ఉన్న త్రిమూర్తులపై యాజమని కోర్టులో కేసు వేయడంతో చిక్కుల్లో పడ్డాడు.

కరోనా వలన వ్యాపారాలన్నీ దెబ్బతినడంతో కఫీల్‌కు బకాయిలు పడడంతో వీసా (అఖమా) రెన్యువల్ కాక త్రిమూర్తులు వీసా ఉల్లంఘన నేరస్థుడిగా మారిపోయాడు. కోర్టు కేసు కారణాన దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది.1.jpg


ఒక వైపు కోర్టు కేసు, దుకాణాలన్నీ మూతబడి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, అఖమా గడువు ముగియడంతో ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. చివరకు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా తిండి కోసం తల్లాడిపోయాడు.

తన మంచి రోజులలో సహాయం పొందిన అనేక మంది అతన్ని మరిచిపోయారు. తన దౌర్భాగ్య పరిస్థితిపై కుమిలిపోతున్న త్రిమూర్తులులో ఆందోళన పెరిగి హైపర్ టెన్షన్‌తో పక్షవాతం సోకింది. కాళ్ళు చేతులు కదలకుండా మంచానికే పరిమితమైన త్రిమూర్తుల గురించి ఆలస్యంగా తెలుసుకొన్న రాజమండ్రికి చెందిన దొమ్మేటి మహేశ్ అనే ఒక మెకానిక్ చలించిపోయారు. పరిస్థితిని అతను సాటా ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ షేఖ్‌కు వివరించగా ఆయన ప్రముఖులు సూర్య, రంజీత్ లతో కలిసి అనేక సార్లు రోగిని సందర్శించారు. కేరళకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దిఖ్ తువూరు సహాయంతో ముజ్జమ్మీల్ కోర్టు కేసులు, అఖమా, ఎగ్జిట్ సమస్యను పరిష్కరించడంతో శుక్రవారం త్రిమూర్తులు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.

రోగుల సహాయార్ధం తమ సంస్థ ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లుగా సాటా అధ్యక్షుడు మల్లేశన్, ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్, ప్రతినిధులు రంజిత్, సుచరితలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 03:10 PM