NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

ABN, Publish Date - Nov 04 , 2024 | 06:05 PM

ఏపీ మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 1/11

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణ నడిబొడ్డున సానీ మౌంటైన్ ఫార్మ్స్‌లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా, వీక్ డేస్ ఆఫీసుల సమయంలో కూడా దాదాపు 2000 మంది అభిమానుల నడుమ జరిగింది.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 2/11

ఈ కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల, ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ కాకర్ల, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్, ఎన్నారై టీడీపీ యుఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా (http://ntrtrustatlanta.org/) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ విగ్రహావిష్కరణ మహోత్సవానికి అమెరికా దేశ నలుమూలల నుంచి తెలుగువారు స్వచ్ఛందంగా తరలి వచ్చారు.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 3/11

ఈ కార్యక్రమంలో నారా లోకేష్ రిబ్బన్ కటింగ్ చేసి, ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న ముసుకు తొలగించి ఆహ్వానితుల కరతాళధ్వనులు నడుమ ఘనంగా ఆవిష్కరించారు. ఈ క్రమంలో నిర్వాహకులు ఆకాశంలో హెలికాఫ్టర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహంపై పూల వర్షం కురిపించడంతో చూడడానికి రెండు కళ్ళు చాలవన్నట్టు వేదిక ప్రాంగణమంతా కేరింతలు, జై ఎన్టీఆర్, జై లోకేష్ నినాదాలతో మారుమోగింది.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 4/11

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఫౌండర్ శ్రీనివాస్ లావు 16 సంవత్సరాల క్రితం 2008లో స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా సంస్థ వివరాలు, కార్యక్రమాలు, అలాగే గత సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నగారి సెంటెన్నియల్ సెలెబ్రేషన్స్ సమయంలో ఇలా విగ్రహం ప్రతిష్టించాలనే ఆలోచన రావడం వంటి విషయాలపై ప్రసంగించారు.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 5/11

గుడివాడ ఎమ్మెల్యే, అట్లాంటా వాసి రాము వెనిగండ్ల మాట్లాడుతూ… అన్నగారి విగ్రహం ఇంత స్థాయిలో అట్లాంటాలో ప్రతిష్టించడం చాలా ఆనందంగా ఉందని, లోకేష్ రావడం మరింత ఊపు తెచ్చిందని, ఐటీ మినిస్టర్ గా లోకేష్ కి ఉన్న పరిజ్ఞానం, 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన కోసం రేయింబవళ్లు పడుతున్న కృషి మరువలేనిదన్నారు. చివరిగా జై ఎన్టీఆర్, జై బాలయ్య అంటూ అందరినీ ఉత్సాహపరిచారు.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 6/11

ఉదయగిరి ఎమ్మెల్యే, ర్యాలీ నగర వాసి సురేష్ కాకర్ల మాట్లాడుతూ… ఇంత పెద్ద కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా మరియు ఎన్నారై టీడీపీ అట్లాంటా నాయకులను అభినందించారు. అలాగే నారా లోకేష్ యువగళం, ఎన్నికలప్పటి పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు వంటి విషయాలను ప్రస్తావించారు.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 7/11

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎంతో మంది యవ్వన దశలో పార్టీలు పెట్టారు గానీ, ఒక్క ఎన్టీఆర్ మాత్రమే 60 సంవత్సరాల వయసులో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ పెట్టి విజయవంతమయ్యారని, ఎన్టీఆర్ మొదలుపెట్టిన కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, దటీజ్ ఎన్టీఆర్ అన్నారు.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 8/11

నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నారైలు అందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృధ్హిలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, అన్నీ ఒకదారికి తెచ్చి గాడిన పెట్టే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకు, లోకేష్‌కే ఉన్నాయన్నారు.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 9/11

ఎన్నారై టీడీపీ యుఎస్ఏ కోఆర్డినేటర్, కాలిఫోర్నియా బే ఏరియా వాసి జయరాం కోమటి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన సహాయాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, అలాగే ముందు ముందు కూడా ఎన్నారైలందరం టీడీపీకి మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుంటామని అన్నారు.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 10/11

చివరిగా ఆంధ్రప్రదేశ్ ఐటీ,ఈసీ, హెచ్ఆర్డీ మంత్రి వర్యులు, టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్నారై అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ (ఎమ్మారై) అని, ఏమీ ఆశించకుండా పార్టీ కోసం అలాగే ఆంధ్ర రాష్ట్రం కోసం ఇప్పుడూ, ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నారన్నారు. రెడ్ బుక్ గురించి యువత ప్రస్తావించగా 92 శాతం సీట్లు వచ్చినప్పుడు బాధ్యత చాలా పెరిగిందని, పెట్టుబడులు మరియు ఉద్యోగాల సృష్టిపై ఫోకస్ చేస్తున్నామని, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మరీ తప్పులు చేసినవారిని మాత్రం వదిలే ప్రసక్తే లోకేశ్ లేదన్నారు. ఇప్పటికే రెడ్ బుక్ చాప్టర్ 1, 2 ఓపెన్ అయ్యాయని, త్వరలో చాప్టర్ 3 మొదలవనుందని, కొంచెం ఓపికగా ఉండాలని కోరారు.

NTR Statue in Atlanta: ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఆధ్వర్యంలో కోలాహలంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ 11/11

అతిథులందరినీ ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా (http://ntrtrustatlanta.org/) సభ్యులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. తర్వాత నారా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. చివరిగా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించిన భరత్ మద్దినేని, మధుకర్ యార్లగడ్డలను లోకేష్ శాలువాతో సత్కరించారు.

Updated at - Nov 04 , 2024 | 06:09 PM