KTR : 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్.. ఏం చేయబోతున్నారు..?
ABN , Publish Date - Aug 26 , 2024 | 10:28 AM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తనతో పాటు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలను కూడా కేటీఆర్ తీసుకెళ్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వీరంతా హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు. కేటీఆర్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి వెళ్తున్నారు సరే.. మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు ఎందుకు..? ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు..? అనేదానిపై పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదైనా కీలక పరిణామం ఏమైనా జరుగుతుందా..? లేకుంటే మరేమైనా ఉంటుందా..? అని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.
ఏం జరుగుతుందో..?
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఇరుక్కుని.. అరెస్టయ్యి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ అన్ని చోట్లా ఎదురు దెబ్బలే తగిలాయి. మరోవైపు.. చెల్లిని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి కేటీఆర్ చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ ఏదీ వర్కవుట్ కావట్లేదు. ఆగస్టు-27న సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన బృందంతో ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. ఎందుకంటే లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు బెయిల్ రావడంతో.. గులాబీ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. కాగా.. జులై-01న కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించగా.. సుప్రీంకోర్టు తలుపు తట్టారు కవిత. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగస్టు-27వ తేదీకి తుది తీర్పు వాయిదా వేయడం జరిగింది. కచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశిస్తోంది.
కేటీఆర్ ఏం చేయబోతున్నారు..?
కవితకు బెయిల్ రాని పక్షంలో ఎమ్మెల్యేలతో కలిసి.. కేటీఆర్ ఢిల్లీ వేదికగా ధర్నా చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను హస్తినకు తీసుకెళ్తున్నారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. లిక్కర్ స్కామ్ కేసులో పలువురు అప్రూవర్లుగా మారగా.. మరికొందరికి బెయిల్ వచ్చింది. కవిత మాత్రం మార్చి-15న అరెస్టయ్యి నాటి నుంచీ తీహార్ జైల్లోనే ఉన్నారు. రేపు ఒకవేళ బెయిల్ రాని పక్షంలో.. అందరికీ బెయిల్ ఇచ్చి.. కవితకు మాత్రమే ఎందుకు ఇవ్వట్లేదు..? ఎందుకీ వైఖరి..? అని సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు.. కవిత అనారోగ్యం కూడా ఉండటంతో బెయిల్ ఇవ్వొచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి చూస్తే.. ఢిల్లీ వేదికగా అటు బెయిల్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా కీలక పరిణామమే జరగబోతోందని మాత్రం చెప్పుకోవచ్చు.