Share News

Duvvada Srinivas: వైసీపీలో ‘దువ్వాడ’ చిచ్చు.. సీన్ రివర్స్!

ABN , Publish Date - Aug 11 , 2024 | 01:07 PM

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారశైలి ఆది నుంచీ వివాదస్పదమే. దూకుడు స్వభావం, నోటిదురుసు, వివాదస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా టెక్కలి జడ్పీటీసీ మినహా మరే ఇతర పదవులను అందుకోలేకపోయారు. రాజకీయంగా తొలుత..

Duvvada Srinivas: వైసీపీలో ‘దువ్వాడ’ చిచ్చు.. సీన్ రివర్స్!
MLC Duvvada Srinivas

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas) ఇంటిపోరు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. గత రెండు రోజులుగా దువ్వాడ, ఆయన సతీమణి వాణి (Duvvada Vani) మధ్య తీవ్ర వివాదం రేగుతోంది. దువ్వాడకు వ్యతిరేకంగా భార్య వాణితో పాటు ఇద్దరు కుమార్తెలు చేస్తున్న నిరసనలు, ఆరోపణలు, బైఠాయింపులతో టెక్కలిలో ఉద్రిక్తత నెలకొంది. అయితే, దువ్వాడ వ్యవహారం వైసీపీలో (YSR Congress) చిచ్చు రేపుతోంది. ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఘోర ఓటమిని చవిచూసిన ఆ పార్టీకి.. శ్రీను వ్యవహారం తలనొప్పిగా మారింది. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు వైసీపీ పరిస్థితి మారింది. ప్రతిపక్ష నాయకులు గానీ, ఇతరులు గానీ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తే అటువంటి విషయాలకు రాజకీయరంగు పులిమేసి ఎంచక్కా తప్పించుకోవచ్చు. కానీ, ఎమ్మెల్సీ దువ్వాడను తూర్పారబడుతుంది ఆయన సతీమణి వాణి, కుమార్తెలు హైందవి, నవీన కావడంతో ఏమి చేయాలో అర్ధంకాని పరిస్థితి వైసీపీలో నెలకొంది. ప్రజాప్రతినిధిగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని, ట్రాప్‌కు గురై ఆమెతో జీవిస్తున్నారని, తమ పిల్లల భవిష్యత్తు గురించి తేల్చాలంటూ భార్య వాణి పట్టుబట్టి నిరసనకు దిగారు. దీంతో రెండురోజులు మౌనం దాల్చిన దువ్వాడ శ్రీను ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించారు. తన తప్పేమీలేదని, తన భార్యతో పడలేకునాన్నని, ఆమెకు విడాకులు ఇస్తున్నానని వెల్లడించారు. అప్పట్లో ఎన్టీఆర్‌, పవన్‌కల్యాణ్‌ వంటివారు ఇలా పడలేకనే మరో పెళ్లిళ్లు చేసుకున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు. పనిలో పనిగా ఈ వ్యవహారాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిపై నెట్టేందుకు యత్నించారు.


duvvada.jpg

ఆది నుంచీ వివాదాలే..!

టెక్కలి నియోజకవర్గ వైసీపీ క్రియాశీలక నాయకుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారశైలి ఆది నుంచీ వివాదస్పదమే. దూకుడు స్వభావం, నోటిదురుసు, వివాదస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా టెక్కలి జడ్పీటీసీ మినహా మరే ఇతర పదవులను అందుకోలేకపోయారు. రాజకీయంగా తొలుత కాంగ్రెస్‌, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చివరకు వైసీపీ పంచన చేరారు. 2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చిన దువ్వాడ టెక్కలి జడ్పీటీసీగా గెలుపొంది కొన్నాళ్లపాటు జిల్లాపరిషత్‌ ఉపాధ్యక్ష పదవి కూడా అందుకున్నారు. ఆ సమయంలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఆయన పార్టీకి దిక్కరించి స్వతంత్ర అభ్యర్థి గొర్లె హరిబాబుకు సహకరించడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొన్నాళ్లపాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావుతో పాటు కూడా ఆయన సఖ్యతగా వ్యవహరించలేదు. కింజరాపు, ధర్మానలపై కేడీ బ్రదర్స్‌ అని విమర్శలు గుప్పించారు. టెక్కలి ఎమ్మెల్యేగా పనిచేసిన హనుమంతు అప్పయ్యదొరని దొంగని, అప్పట్లో డీసీసీ అధ్యక్షురాలుగా వ్యహరించిన బొడ్డేపల్లి సత్యవతిని స్వార్థపరురాలని అదే పార్టీలో ఉంటూ వారిపై విమర్శలు గుప్పించారు. స్వపక్షంలో విపక్షంలా వారితో వివాదాన్ని కొనసాగించారు. దువ్వాడ వ్యవహరించిన తీరు అప్పుడు, ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.


Duvvada-With-YSR-And-Jagan.jpg

ఒకటా.. రెండా..!

2019-24 మధ్యకాలంలో వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కూడా మంత్రులుగా వ్యవహరించిన ధర్మాన సోదరులతో గానీ, మరోమంత్రి సీదిరి అప్పలరాజుతో గానీ ఆయనకు ఏనాడూ సఖ్యత లేదు. కాకరాపల్లి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ వ్యతిరేకిస్తూ ఆందోళనకారులతో కలిసి ఉద్యమాలు చేపట్టడంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే ఒడిశాలో ఆయన నిర్వహించిన గ్రానైట్‌ క్వారీకి సంబంధించి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో 50 రోజుల పాటు ఆ రాష్ట్రంలో జైలు జీవితం గడిపారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ఏకవచనంతో సంభోదించి దుర్భాషలాడుతుండడంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దువ్వాడకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అది దన్ను చూసుకొని దువ్వాడ మరింత రెచ్చిపోయి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపై విచ్చలవిడిగా అక్రమకేసులు బనాయించారు. కాగా, 2014 ఎన్నికల్లో దువ్వాడ శ్రీను టెక్కలి అసెంబ్లీకి వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో వైసీపీ నుంచి శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. 2024లో మళ్లీ టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందారు. చివరకు పార్టీని కూడా పతనం అంచున నిలబెట్టేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడి తర్వాత ఆ రీతిలో కేసులు నమోదైంది దువ్వాడ పైనే.


Duvvada-Srinivas.jpg

పార్టీ మారే యోచనలో కేడర్‌!

దువ్వాడ వ్యవహారాన్ని కారణంగా చూపి వైసీపీ ద్వితీయస్థాయి నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంటీసీలు, సర్పంచ్‌లు పార్టీమారే ఆలోచన చేస్తున్నారు. అధిష్ఠానంతో పాటు పార్టీ నాయకుల నుంచి ఆయనకు మద్దతు కరువైంది. ఒక్కరు కూడా దువ్వాడకు అనుకూలంగా మాట్లాడడం లేదు. ఎవరు చెప్పినా దువ్వాడ వినే స్థితిలో ఉండరన్నది సీనియర్‌ నాయకుల భావన. అతని నోటి దురుసుతో తాము బాధపడినవారిమేనని, ఇప్పుడు అతని భార్య, పిల్లలు భరించలేక బయటకు వచ్చారని వైసీపీలో చర్చ నడుస్తోంది. ఇలాంటి వారివల్ల పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందని కేడర్‌ ఆవేదన చెందుతుంది. పైగా నిన్నటి వరకు నీతిసూత్రాలు వెల్లడించిన దువ్వాడ ఇప్పుడు మరోమహిళతో ఉంటూ భార్య, పిల్లలతోనే మాటలు కాస్తున్న పరిస్థితికి దిగజారి పోయారు. అప్పట్లో పవన్‌ పెళ్లిళ్లపై, అలాగే నారా లోకేష్‌ తన స్నేహితులతో ఉన్న ఫొటోలను మీడియాకు చూపించి దువ్వాడ నీచంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో తనపైనే ట్రోలింగ్‌ అవుతున్నాయి.


Duvvada-With-Jagan.jpg

నీ వ్యాఖ్యలు.. నీకే వర్తించవా..!?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ నోటి దురుసుపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలు.. ఇప్పుడు ఆయనకే వర్తిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దువ్వాడ శ్రీను గతంలో శ్రీకాకుళం పార్లమెంట్‌, టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశంపార్టీ నేత కింజరాపు అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీను నోరు పారేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి సీఎం జగన్‌.. శ్రీనుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం మరింత ప్రోత్సహించినట్లు అయింది. అప్పట్లో ప్రతిపక్ష నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. బూతులతో విరుచుకుపడ్డారు. నారా లోకేష్‌, పవన్‌కల్యాణ్‌, చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడులపైనా విమర్శలు చేశారు. అందరినీ ఏకవచనంతో సంబోధించారు. మగాడు ఎలా ఉండాలన్నదీ నీతిసూత్రాలు చెప్పారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు దువ్వాడను నెటిజన్లు నిలదీస్తున్నారు.


Duvvada-And-Madhuri.jpg

తెలుగువాడు ఏకపత్రీవ్రతుడు..!

‘‘ఒక్కో మగాడు కొన్ని వేలమందిని పెళ్లి చేసుకోగలడు. కానీ పద్ధతీ, సంస్కారం, హిందూమతం వంటివి అడ్డువస్తాయి. ఓ తెలుగువాడిగా ఏకపత్నీవ్రతమే మన మతం. ఒకే స్త్రీనే పెళ్లాడి.. ఆ స్త్రీతోనే జీవితం పూర్తిచేయడం మన సంప్రదాయం. అటువంటి సంప్రదాయానికి తూట్లు పొడిచిన నీచుడు పవన్‌కల్యాణ్‌’’ అంటూ దువ్వాడ శ్రీను అధికారంలో ఉన్నప్పుడు ఓ మీడియా ఛానెల్‌లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దువ్వాడ శ్రీను మరో మహిళతో ఉంటున్నారని.. తనను, తన పిల్లల భవిష్యత్తుగురించి పట్టించుకోవడం లేదని ఆయన సతీమణి దువ్వాడ వాణి గడచిన రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆయన వైఖరిని బహిరంగంగానే భార్య, పిల్లలు ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నప్పుడు దువ్వాడ శ్రీను చేసిన విమర్శల వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిని దువ్వాడకే ఆపాదిస్తూ.. నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరో మహిళతో కలసి ఉన్న ఫొటోలను.. ఆ వీడియోలను కుటుంబ సభ్యలు విడుదలచేయడంతో వాటిని కూడా ట్యాగ్‌ చేస్తున్నారు. ఇటు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా ఎండగడుతున్నారు.


Duvvada-Family-Fight.jpg

వాణికి విడాకులు ఇస్తున్నా..

నా 30 ఏళ్ల వైవాహిక జీవితంలో భార్యగా ఉన్న దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాఅని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం ఆయన స్థానిక వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నా చుట్టూ కత్తులే ఉన్నాయి. నాకు అందరూ శత్రువులే. నా కుటుంబంతో పాటు రాజకీయ ప్రత్యర్థుల వలన నేను బలవుతున్నా. నాకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు ఉన్నారు. నా ఓటమికి వారే కారణం. నా మామ సంపతిరావు రాఘవరావు పచ్చచొక్కాల పక్కన ఉండి టీడీపీకి ఓట్లు వేయించాడు. నా భార్య, కుమార్తెలు నాపై దాడి చేయడానికి నా ఇంటికి వచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియజేసినా స్పందించడం లేదు. ఆత్మరక్షణ కోసం పోలీసులకు రెండు నెలలుగా వెపన్‌ అడుగుతున్నా ఇవ్వడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కుమార్తెలను గౌరవంగా చూస్తా. కానీ, వారు రెండురోజులుగా మందీ మార్బలంతో కారంగుండ, రాడ్లు వైర్లు , కటింగ్‌ బ్లేడ్లతో నాపై దాడి చేసేందుకు వచ్చారు. ఇది సరికాదు. నా భార్య వాణి ఎన్నో అవమానాలకు గురి చేసింది. ఆమెతో కలిసి ఉండలేని పరిస్థితి నెలకొంది. అందుకే విడాకులు ఇస్తున్నా. ఈ ఎపిసోడ్‌ వెనుక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హస్తం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో నాపై రెడ్‌బుక్‌ తెరవకుండా, ఈ రకంగా హింసిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే అచ్చెన్నాయుడు బాధ్యత వహించాల్సి వస్తుంది. దివ్వల మాధురితో లేనిపోని సంబంధాలు సృష్టించి నా పరువు తీశారు. నా భార్య విలువ లేకుండా చేసింది. భోజనం కూడా సరిగ్గా పెట్టలేదు. మాధురి ఆత్మహత్య చేసుకోబోగా నేను వారించి ఆపాను. నాకు అండగా ఉన్న ఆమెతో రెండేళ్లుగా కలిసి తిరుగుతున్నా’ అని దువ్వాడ తెలిపారు.


Duvvada-Rachha.jpg

దువ్వాడ మాపై దాడికి ప్రయత్నించాడు: వాణి

‘రెండేళ్లుగా నా భర్త దువ్వాడ శ్రీనివాస్‌ చేస్తున్న పనుల మూలంగా కుటుంబమంతా రోడ్డున పడి ఇబ్బందులు పడుతున్నాం.’ అని టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు, ఆయన భార్య దువ్వాడ వాణి తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘దువ్వాడ తీరుతో మా కుటుంబం, పిల్లలు చాలా బాధ పడుతున్నారు. ఎంతో పేరున్న మా కుటుంబాన్ని పూర్తిగా డ్యామేజ్‌ చేశాడు. మరో మహిళ ట్రాప్‌లో పడి లేనిపోని కబుర్లు చెబుతున్నాడు. ఆయన ఉండే నివాసం వద్దకు నేను పిల్లలతో కలిసి వెళ్తే మాపై రాడ్డుతో దాడిచేయడానికి వచ్చాడు.’ అని అన్నారు. దువ్వాడ కుమార్తె హైందవి మాట్లాడుతూ.. తమ కుటుంబం విడిపోవడానికి కారణం దువ్వాడ సోదరుడు బాబా అని ఆరోపించారు.

Duvvada-Srinivas.jpg


వాణి, మాధురి గురించి దువ్వాడ షాకింగ్ విషయాలు



ఎవరీ దివ్వెల మాధురి?


Updated Date - Aug 11 , 2024 | 01:20 PM