Share News

అవెక్కడ?

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:52 PM

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ టాయిలెట్లు మాయమయ్యాయి.

అవెక్కడ?

  • నగరంలో కనిపించని స్వచ్ఛ టాయిలెట్లు

  • అధికారికంగా 26 శాతం కనుమరుగు

  • క్షేత్రస్థాయిలో అంతకంటే ఎక్కువే

  • అయినా నిర్వహణకు రూ.32 కోట్లు ఖర్చు

  • గతేడాదితో పోలిస్తే మరింత తగ్గుదల

  • అక్కడక్కడా ఉన్నవీ నిరుపయోగమే

హైదరాబాద్‌ సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ టాయిలెట్లు మాయమయ్యాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా(ఓడీఎఫ్‌++) హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో 26 శాతం కనిపించడం లేదు. అక్కడక్కడా ఉన్న వాటిల్లోనూ ఎక్కువ సంఖ్యలో వినియోగంలో లేవు. ప్రధాన, అంతర్గత రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై విస్తృతంగా ఈ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.56.56 కోట్లు వెచ్చించారు. నిర్వహణ పేరిట ఇప్పటికే రూ.32 కోట్లకుపైగా ఖర్చు చేశారు. గతంలో ప్రతీ రహదారిపై కనిపించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లు(పీఎ్‌ఫటీ) ప్రస్తుతం చాలాచోట్ల కనిపించడం లేదు. ఇటీవలి కౌన్సిల్‌ సమావేశంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. గ్రేటర్‌లో 4,826 సీటింగ్‌తో 1,857 పబ్లిక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం 1,385 ఉన్నట్టు పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 472 టాయిలెట్లు మాయమయ్యాయి. యేడాది క్రితం అధికారులు వెల్లడించిన వివరాలతో పోలిస్తే ప్రస్తుతం 788 టాయిలెట్లు తక్కువగా ఉండడం గమనార్హం. యేటికేడు మరుగుదొడ్ల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. స్వచ్ఛ భారత్‌లో మెరుగైన ర్యాంకు లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ, షీ టాయిలెట్లు మాయమవడం వెనుక ఎవరి హస్తం ఉన్నదని చర్చనీయాంశంగా మారింది.

రూ.90 కోట్లు ఖర్చు

గర్వ్‌, బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీఓటీ), సులభ్‌ కాంప్లెక్స్‌లు మినహ నగరంలో మెజార్టీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లున్నాయి. ఒక్కో పీఎ్‌ఫటీకి సీటింగ్‌ సామర్థ్యాన్ని బట్టి రూ.5 నుంచి 8 లక్షల వరకు ఖర్చు చేశారు. పది వరకు టాయిలెట్లను ఒక క్లస్టర్‌గా పేర్కొంటు నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించారు. రోజూ మూడు పర్యాయాలు శుభ్రపర్చడం.. అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయడం ఏజెన్సీల బాధ్యత. సిబ్బంది సరిగా పని చేస్తున్నారా? లేదా? తెలుసుకునేందుకు క్లీన్‌ చేసిన ప్రతీసారి స్కానింగ్‌ చేసేలా క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు. అయినా చాలా పీఎ్‌ఫటీల్లో క్లీనింగ్‌ జరగడం లేదు. కానీ నిర్వహణ వ్యయం మాత్రం ఠంచనుగా ఏజెన్సీలకు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.32 కోట్లకుపైగా నిర్వహణ కోసం ఖర్చు చేసినట్టు పారిశుధ్య నిర్వహణ విభాగం వర్గాలు పేర్కొన్నాయి. ఏర్పాటు, నిర్వహణకు రూ.90 కోట్ల వరకు వెచ్చించడం గమనార్హం.

ఆది నుంచి గందరగోళమే

పీఎ్‌ఫటీల ఏర్పాటుపై ఆది నుంచి అనుమానాలున్నాయి. బల్దియా అధికారికంగా వెల్లడిస్తోన్న వివరాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. గతేడాది 2,173 టాయిలెట్లు ఉన్నట్లు చూపగా.. ఇప్పుడా సంఖ్యను 1,857గా పేర్కొనడం గమనార్హం. ఎందుకీ అయోమయమంటే.. వేర్వేరు రకాల టాయిలెట్లు ఉండడంతో కొంత గందరగోళం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఒక్కోసారి ఒక్కో కేటగిరీ మరుగుదొడ్లను ఒక్కోలా చూపుతున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో స్వచ్ఛ టాయిలెట్లు ఏర్పాటు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటిని ఏర్పాటు చేసిన అనంతరం సంబంధిత ఏజెన్సీలు కొన్ని తిరిగి తీసుకెళ్లాయన్న ఫిర్యాదులు రాగా.. ఇంకొన్ని చోట్ల స్ర్కాప్‌గా విక్రయించినట్లు తెలుస్తోంది. టాయిలెట్లలోని కమోడ్‌లు, నల్లాలు, వాష్‌ బేసిన్‌లూ చోరీకి గురయ్యాయి.

స్వచ్ఛ టాయిలెట్ల లెక్క ఇది...

జోన్‌ - 2023 - 2024

ఎల్‌బీనగర్‌ - 532 - 369

చార్మినార్‌ - 355 - 123

ఖైరతాబాద్‌ - 201 - 174

కూకట్‌పల్లి - 352 - 381

శేరిలింగంపల్లి - 445 - 198

సికింద్రాబాద్‌ - 288 - 140

మొత్తం - 2,173 - 1,385

తాజా లెక్కల ప్రకారం..

కేటగిరి - మొత్తం - ప్రస్తుతం

పబ్లిక్‌ టాయిలెట్లు - 1,818 - 1,366

షీ టాయిలెట్లు - 39 - 19

మొత్తం - 1,857 - 1,385

Updated Date - Jul 12 , 2024 | 04:16 PM