Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ..!?
ABN , Publish Date - Aug 03 , 2024 | 07:45 AM
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను (Vallabhaneni Vamsi Mohan) అరెస్టు చేస్తారా? లేదా? అనే అంశంపై టీడీపీ (TeluguDesam) శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై (Attack On Gannavaram TDP Office) దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉండటంతో ఆయన్ను అరెస్టు చేశారని శుక్రవారం ప్రచారం జరిగింది. వంశీ ప్రధాన అనుచరులు యూసఫ్ పఠాన్, సర్నాల రమేశ్‌ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేశామని యూసఫ్ పఠాన్‌ను శనివారం కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. తాజా పరిణామాలతో వంశీ ఎక్కడ ఉన్నాడన్న అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఉన్నారా.. ఉంటే ఎక్కడ..?
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా పోలీసులు విచారణను అటకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కేసు ఊపిరిపోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురికి బెయిల్ కూడా వచ్చింది. ఈ కేసులో 71వ నిందితుడిగా వంశీ పేరు ఉంది. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేస్తారా..? లేదా..? అన్న అంశంపై టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ నడుస్తోంది. అసలు వంశీ దేశంలో ఉన్నారా..? లేక అమెరికా వెళ్లిపోయారా..? అన్న అంశంపై స్పష్టత కొరవడింది.
వంశీ అరెస్ట్‌పై వదంతులు..
వంశీ అరెస్టుపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం వంశీ సతీమణి గన్నవరం వచ్చారు. వంశీ ఉపయోగించే వాహనశ్రేణిలోనే ఆమె తన బంధువుల ఇంటికి వెళ్లారు. వంశీ వచ్చారన్న సందేహంతో పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేశారు. దీంతో వంశీని అరెస్టు చేశారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే వంశీ అసలు ఎక్కడ ఉన్నారన్న దానిపై ఆయన అనుచరులే భిన్న కథనాలను ప్రచారం చేస్తున్నారు. వంశీ అమెరికా వెళ్లిపోయారని ఆయన సన్నిహితుల్లో కొందరు ప్రచారం చేస్తుండగా, వంశీ ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చారని ప్రస్తుతం రాజస్థాన్ లేదా బెంగళూరులో ఉంటున్నారని ఆయన అనుచరుల్లోనే మరో వర్గం చెబుతోంది. దీనిపై పోలీసుల్లోనూ స్పష్టత లేదు.