Share News

భిన్న తీర్పేనా?

ABN , Publish Date - May 16 , 2024 | 03:54 PM

పోలింగ్‌ ముగిసింది.. ఫలితాలు రావడానికి సుమారు 18 రోజుల సమయం ఉంది.

భిన్న తీర్పేనా?

  • మూడు స్థానాల ఫలితాల్లో మళ్లీ తేడా

  • 2019 నాటి ఫలితాలు పునరావృతం

  • ఏకపక్షమా... తలా ఒకటా అన్న చర్చ

  • హైదరాబాద్‌లో గత ఫలితమే రిపీట్‌ ?

  • చాలా అసెంబ్లీ సెగ్మెంట్లల్లో క్రాస్‌ ఓటింగ్‌

  • ఓటరు నాడి అంతుబట్టని ప్రధాన పార్టీలు

  • కొందరు నేతలు విశ్రాంతి.. మరికొందరు టూర్లకు

హైదరాబాద్‌ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ ముగిసింది.. ఫలితాలు రావడానికి సుమారు 18 రోజుల సమయం ఉంది. కొందరు అభ్యర్థులు ఈ సమయాన్ని భారంగా గడుపుతుండగా కొందరు తమ కుటుంబీకులతో జాలీగా, మరికొందరు టూర్లకు వెళ్లి కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికివారు తమకు ఏ ప్రాంతంలో సానుకూలత ఉంది.. అంతా అనుకున్నట్లే జరిగిందా.. అంటూ సమీకరణాలు, గణాంకాలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే అయిదున్నర నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే నిన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్నో తేడాలు కనిపించాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో అంతగా వ్యత్యాసం కనిపించకున్నా బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎంట్రీ మాత్రం పాతనగరంలో మజ్లిస్‌ వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టించింది. అసెంబ్లీ ఎన్నికలలాగే మజ్లిస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలనూ మొదట లైట్‌గా తీసుకున్నది. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ అభ్యర్థి ప్రచారతీరువారికి కళ్లు తెరిపించేలా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి, యాకుత్‌పురా సీట్లు చేజారినట్టే జారి మళ్లీ అందినప్పటికీ వారికి పట్టిన చెమటలు ఇంకా ఆరలేదు. అంతలోనే పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చిపడ్డాయి. బీజేపీ తరపున నిలబడింది ఓ మహిళే అయినా గట్టి పోటీ ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు అసెంబ్లీ ఫలితాలే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తాయని ఓటర్ల, బీజేపీయేతర పార్టీల నాయకుల అభిప్రాయం.

సికింద్రాబాద్‌లో భిన్నం

సికింద్రాబాద్‌లో మాత్రం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్‌ ఎన్నికలు భిన్నంగా కనిపించాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పలికిన చోటా నేతలు ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతు పలకడం... బీఆర్‌ఎస్‌ మద్దతుదారుల్లోనూ కొందరు కాంగ్రెస్‌ లేదా బీజేపీ వైపు మొగ్గడంతో అప్పటి ఉత్సాహం కనిపించలేదు. అయినా అభ్యర్థులు తమ మద్దతుదారులను ఎప్పటికప్పుడు కూడదీసుకుంటూ రోడ్‌షోలు, పాదయాత్రలు నిర్వహించినప్పటికీ ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికల నాటి ఉత్సాహం కనిపించలేదని తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీగా (బీజేపీ) ఉన్న కిషన్‌రెడ్డి సైతం బాగా శ్రమించాల్సి వచ్చింది. ఆయనకు మద్దతు అధికంగా ఉన్న అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌లలో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితి అలా లేదని తెలుస్తోంది. ఇక కాంగ్రె్‌సకు బలం ఉన్నట్లు కనిపించినప్పటికీ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమైందని, పార్టీ కేడర్‌, నాయకుల్లో అసంతృప్తి నెలకొందని స్పష్టమైంది. మరోవైపు తమ అభ్యర్థి పద్మారావుకు సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, నాంపల్లి, జూబ్లీహిల్స్‌లో గట్టి మద్దతు లభించిందని, విజయం తమదేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ ఫలితాలుంటాయని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.

మల్కాజిగిరిలో ఇతర పార్టీల్లో కనిపించని ఊపు

మల్కాజిగిరిలో బీజేపీ తప్ప ఇతర పార్టీల్లో అంతగా ఉత్సాహం కనిపించలేదని తెలుస్తోంది. ఇక్కడినుంచి పోటీ చేస్తున్న ఈట ల రాజేందర్‌ మొదటి నుంచి తన విజయంపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ నుంచి మద్దతు లభించగా బీఆర్‌ఎ్‌సకు కంటోన్మెంట్‌ నుంచి బాగా మద్దతు లభించింది. కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి స్థానాల్లో మాత్రం బీజేపీకి లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని అంచనా.

చేవెళ్ల నియోజకవర్గంలో తారుమారు

నగరంతో సంబంధం ఉన్న చేవెళ్ల లోక్‌సభ స్థానంలోనూ భిన్నమైన ఫలితం వచ్చేలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన కొండా విశ్వేశ్వరరెడ్డి వైపే ఓటర్లు మొగ్గుతారనే అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి కూడా గట్టిపోటీ ఇచ్చారు. పైగా ముఖ్యమంత్రి స్వస్థలం అయిన మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోకి వెళ్లిన కొడంగల్‌లోని మూడు మండలాలు చేవెళ్ల పరిధిలోకే వస్తాయి. ఈ దృష్ట్యా ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - May 16 , 2024 | 03:54 PM