Share News

Python Attack: కాలకృత్యాల కోసం బాత్‌రూమ్‌కు వెళ్లాలనేది ఇందుకే! పొదల మాటుకు వెళితే..

ABN , Publish Date - Jul 26 , 2024 | 07:12 PM

కాలకృత్యాల కోసం పొదలమాటుకు వెళ్లిన ఓ వ్యక్తిపై కొండచిలువ దాడి చేసింది. అతడి గొంతుకకు చుట్టుకుని ఊపిరాడకుండా చేసి మింగేసే ప్రయత్నం చేసింది. అతడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే వచ్చి బాధితుడిని కాపాడారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Python Attack: కాలకృత్యాల కోసం బాత్‌రూమ్‌కు వెళ్లాలనేది ఇందుకే! పొదల మాటుకు వెళితే..

ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా కూడా అనేక మంది ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలకు వెళుతుంటారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి అంటురోగాలు వ్యాపిస్తాయి. ప్రజల్లో ఈ అలవాటు మాన్పించేందుకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. అవగాహన పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయినా, దేశంలో ఎక్కడో ఒక మూల ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండగా కొందరు అనూహ్య ప్రమాదాల్లో కూడా పడుతున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

NRI: ఎడారిలో మోసపోయిన మరో ప్రవాసీని రక్షించిన నారా లోకేశ్!


జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని పొదలమాటుకు వెళ్లాడు. ఇంతలో 15 అడుగుల భారీ కొండచిలువ అతడి వెనక వైపు నుంచి మెల్లగా వచ్చి తోకతో అతడి పీకను పట్టుకుంది. క్రమంగా పట్టుబిగిస్తూ అతడికి ఊపిరాడకుండా చేసి అమాంతం మింగేసే ప్రయత్నం చేసింది. దాని పట్టునుంచి విడిపించుకోలేక కంగారు పడిపోయిన బాధితుడు పెద్దపెట్టున కేకలు వేశారు. తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు.

అతడి అరుపులు విని పరుగుపరుగున వచ్చిన గ్రామస్థులు అక్కడి దృశ్యం చూసి షాకైపోయాడు. కొండచిలువ పట్టు నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్న బాధితుడిని చూసి నిర్ఘాంతపోయారు. ఆ మరుక్షణమే అతడిని కాపాడేందుకు రంగలోకి దిగారు. కానీ అతడి నుంచి పామును విడదీయడం గ్రామస్థులకు కష్టంగా మారింది. ఇక లాభం లేదనుకున్న గ్రామస్థులు పామును చంపేందుకే నిర్ణయించారు. ఓ గొడ్డలి తెచ్చి పామును పలుమార్లు కొట్టి చంపి అతడిని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.


అయితే, ఈ ఘటనలో పామును చంపినందుకు ఎవరిపైనా కేసు నమోదు కాలేదు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రాణాలను కాపాడుకునేందుకు అడవి జంతువును చంపితే ఎటువంటి కేసు ఉండదని పేర్కొన్నారు. ‘‘కొండచిలువ అతడి గొంతుకకు చుట్టుకోవడంతో బాధితుడు ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి సందర్భాల్లో పామును చంపితే కేసులు ఉండవు’’ అని ఫారెస్ట్ రేంజర్ ఒకరు తెలిపారు.

మరోవైపు, ఈ ఘటన తాలుకు వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పోస్టు చేసిన కొద్ది సేపటికే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. జనాలు రకరకాల వ్యాఖ్యలతో కామెంట్ సెక్షన్‌ను హోరెత్తించారు. బహరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలు తీర్చుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయని కొందరు సెటైర్లు పేల్చారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 26 , 2024 | 07:20 PM