Viral: కళ్లు చెదిరే డిజైన్‌లో భారతీయ ఎయిర్ ట్యాక్సీ.. ఆనంద్ మహీంద్రా ఫిదా!
ABN , Publish Date - May 11 , 2024 | 06:16 PM
భారతీయ కంపెనీ రూపొందిస్తున్న ఓ వినూత్న ఎయిర్ ట్యాక్సీని చూసి ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. సృజనాత్మకతకు భారత్ కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో సృజనాత్మకతే అసలైన నిధి. కొత్త ఆలోచలతో కొట్లు కొల్లగొడుతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఈ ఒరవడి సాధారణంగా పాశ్చాత్య ప్రపంచానికే పరిమితమన్న భావన ఉంది. ఇది తప్పని రుజువు చేస్తూ ఓ భారతీయ కంపెనీ అద్భుత డిజైన్‌తో ఎయిర్ ట్యాక్సీ రూపొందిస్తోంది. దీన్ని చూసి ఏకంగా ఆనంద్ మహీంద్రానే ఫిదా అయిపోయారు. దీన్ని రూపొందించిన భారతీయ కంపెనీని, సంస్థ వెనకుండి ప్రోత్సహిస్తున్న ఐఐటీ మద్రాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా(Viral) మారింది.
ఐఐటీ సంస్థ ప్రోత్సాహంతో నడుస్తున్న స్టార్టప్ సంస్థ ది ఈప్లేన్ కంపెనీ దీన్ని రూపొందించింది. సైఫై సినిమాల్లో లాగా కళ్లు చెదిరే డిజైన్‌తో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీని చూసి ఆనంద్ మహీంద్రా అబ్బురపడ్డారు. ‘‘ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేట్ చేస్తున్న ది ఈప్లేన్ కంపెనీ ఈ ఎయిర్ ట్యా్క్సీని రూపొందిస్తోంది. వచ్చే ఏడాది కల్ల దీన్ని ఆవిష్కరించొచ్చు. అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్న విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్ యావత్ ప్రపంచంలోనే ముందుంది. ఐఐటీ మద్రాస్ కారణంగా అనేక ఉన్నత లక్ష్యాలతో సంస్థలు ఉనికిలోకి వస్తున్నాయి. వినూత్న ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చే అసలైన ఇన్నోవేటర్లు ఉన్న దేశంగా మనం మారిపోయాము. ధైర్యంగా ఉన్నత లక్ష్యాలవైపు పయనించాలి. పరిమితులనే వే ఉండకూడదు’’ అని ఆయన నెట్టింట పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఎయిర్ ట్యాక్సీ ఫొటోలను కూడా పంచుకున్నారు (Anand Mahindra Gives A Shout Out To IIT Madras And Incubators For Driving India's Innovation Revolution).
Viral: విమానం ఇంటిపై నుంచి వెళుతుండగా చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం! వెళ్లి చూస్తే..
ఈ ఎయిర్ ట్యాక్సీని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. దేశంలో ఎందరో మేధావులు ఉన్నారని, వారిని ప్రోత్సహించే వాతావరణమే కరువైందని కొందరు చెప్పారు. భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ మారుస్తున్నందుకు ఐఐటీ మద్రాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వివరాల ప్రకారం, ఈ ఫ్లైయింగ్ ట్యాక్సీ ఒక్క చార్జింగ్‌తో 200 కిలోమీటర్ల పాటు ప్రయాణించగలదు. ఇందులో ఇద్దరు ప్రయాణించే వీలుంది. హెలికాఫ్టర్‌లా ఇది నిట్టనిలువుగా గాల్లోకి ఎగిరి ప్రయాణం ప్రారంభిస్తుంది. 5 బై 5 మీటర్ల వైశాల్యం ఉండే ఈ ట్యాక్సీని అందుబాటు ధరలలోనే మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నారు.