Share News

వందేళ్ల రాజసం.. ఈ గంధర్వమహల్‌

ABN , Publish Date - Sep 15 , 2024 | 07:45 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు వెళ్లిన ఎవరైనా గంధర్వ మహల్‌ చూడకుండా వెనక్కి రాలేరు. నాలుగు అంతస్థులు, పాతిక గదులతో రాజసం ఉట్టిపడే ఆ భవనం నిర్మించి ఈ ఏడాదితో వందేళ్లు అవుతోంది. ఇప్పటికీ చెక్కు చెదరని చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన గంధర్వమహల్‌.. ఓ అద్భుత సౌందర్య సౌధం...

వందేళ్ల రాజసం.. ఈ గంధర్వమహల్‌

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు వెళ్లిన ఎవరైనా గంధర్వ మహల్‌ చూడకుండా వెనక్కి రాలేరు. నాలుగు అంతస్థులు, పాతిక గదులతో రాజసం ఉట్టిపడే ఆ భవనం నిర్మించి ఈ ఏడాదితో వందేళ్లు అవుతోంది. ఇప్పటికీ చెక్కు చెదరని చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన గంధర్వమహల్‌.. ఓ అద్భుత సౌందర్య సౌధం...

రాజుల పాలనలో కోటలుండేవి. రాజులు పోయి, రాజ్యాలు అంతరించాక జమీందారి వ్యవస్థ వచ్చింది. అలనాటి రాజుల తరహాలో జమీందారులు కూడా రాచఠీవీ కలిగిన అద్భుత భవనాలను నిర్మించి.. తమ వైభవం చాటే ప్రయత్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్వపు రోజుల్లో రెండే రెండు కుటుంబాల వారు ఆదాయపన్ను చెల్లించే వారట.


ఒకటి.. ఏలూరుకు చెందిన మోతి జమీందార్‌ కుటుంబం.. రెండు.. ఆచంటకు చెందిన గొడవర్తి కుటుంబం.. 1916లో ఈ కుటుంబానికి చెందిన యువకుడు గొడవర్తి నాగేశ్వరరావు జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాజసం ఉట్టిపడే ఓ అద్భుత భవనం నిర్మించాలని భావించాడు. దీని కోసం ఆయన రాజస్థాన్‌ వెళ్లి అక్కడి కోటలను, కట్టడాలను పరిశీలించారు. అనంతరం ఆచంటలో 1918లో గంధర్వ మహల్‌ నిర్మాణం మొదలుపెట్టి.. 1924 నాటికి పూర్తి చేశారు. ఈ ఏడాదికి భవనం వయస్సు వందేళ్లు. నాటి జమీందారి వ్యవస్థ వైభవానికి ప్రతీకగా నిలిచింది గంధర్వ మహల్‌.


దీని నిర్మాణం కోసం బర్మా నుంచి శ్రేష్ఠమైన టేకు, కలప.. బెల్జియం నుంచి నాణ్యమైన అద్దాలు, లండన్‌ నుంచి బలమైన ఇనుప గ డ్డర్‌లు తెప్పించి.. మహల్‌ను నిర్మించారు. విద్యుత్‌ లేని రోజుల్లోనే జనరేటర్‌ ఏర్పాటు చేసుకుని, విదేశీ విద్యుత్‌ దీపాలతో భవనాన్ని అలంకరించేవారు.

గంధర్వ మహల్‌ పేరుకు తగ్గట్టు గంధర్వులే నిర్మించారా? అనేంత కళా నైపుణ్యం చూపరులను కట్టిపడేస్తుంది. సర్వాంగ సుందరమైన మహల్‌ నేటికీ చెక్కు చెదరలేదు. ముఖ్యమంత్రులుగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి, ఎన్‌టీ రామారావు, చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు ఈ భవనంలో ఆతిథ్యం స్వీకరించారు. ఇక్కడికి ఎవరొచ్చినా మైసూర్‌ మహారాజ ప్యాలెస్‌లాగే ఉందని ఆనందించడం విశేషం.


పియానో ప్రత్యేక ఆకర్షణ...

మహల్‌ సెంట్రల్‌హాల్‌లో కనిపించే పియానో ఈ కట్టడానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. వీరి కుటుంబంలోని సంగీత ప్రియులు పియానోను లండన్‌ నుంచి తెప్పించారట. 1885లో లండన్‌లో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ పోటీలలో ఈ పియానో రజత పతకం గెల్చుకుంది. దీని మెట్లను తాకితే ఇప్పటికీ సుస్వరాలు పలుకుతుంది. గంధర్వ మహల్‌ నిర్మించి వందేళ్లయిన సందర్భంగా జూలై 19న గొడవర్తి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు వేడుకను నిర్వహించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరయ్యారు.

sun3.2.jpg


sun3.3.jpg

‘గంధర్వ మహల్‌కు 1969, 2009లలో రంగులు వేయించాం. మళ్లీ రూ.25 లక్షలతో ఈ మధ్య మరోసారి పెయింటింగ్‌ వేయించి.. పూర్తి స్థాయిలో అలంకరించాం. మహల్‌లోని నాలుగు అంతస్థుల్లో 25 గదులు ఉన్నాయి.సుమారు 50 సెంట్ల భూమిలో భవనం నిర్మించారు.. స్థానిక చరిత్రకు సజీవ సాక్ష్యం ఈ కట్టడం..’’ అని కుటుంబసభ్యుల్లో ఒకరైన గొడవర్తి శ్రీరాములు పేర్కొన్నారు. ‘ఇలాంటి చారిత్రక కట్టడాలు పూర్వ వైభవానికి చిహ్నాలు.. తప్పక కాపాడుకోవాల’టారు

ఆచంటవాసులు.

- బోడపాటి వెంకట నాగేశ్వరరావు, ఆచంట

Updated Date - Sep 15 , 2024 | 07:45 AM