Share News

నాకు నటన రాదన్నారు..

ABN , Publish Date - Sep 01 , 2024 | 08:13 AM

భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి క్లాసిక్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ యువ హీరో ‘లక్కీ భాస్కర్‌’గా అలరించేందుకు సిద్ధమయ్యాడు.

నాకు నటన రాదన్నారు..

భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి క్లాసిక్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ యువ హీరో ‘లక్కీ భాస్కర్‌’గా అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మాలీవుడ్‌ స్టార్‌ చెబుతున్న సంగతులివి...

ట్రోలింగ్‌ బాధితుణ్ణే...

అందరిలాగే నేనూ ట్రోల్స్‌ బారినపడ్డవాణ్ణే. కెరీర్‌ ఆరంభంలో ప్రతీ ఒక్కరికి తన నటనకు ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా! అలాగే నాకూ ఉండేది. నేను నటించిన సినిమాలపై వచ్చే రివ్యూలు చదివేవాడిని. వాటిలో నాకు యాక్టింగ్‌ రాదని, నటుడిగా పనికిరానని, ఇక సినిమాలు ఆపేస్తేనే మంచిదని.. చాలా నెగిటివ్‌గా రాశారు. వాటిని చూసి చాలా బాధేసింది. అయితే 2016లో నాకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చింది.


జీవితం సరికొత్తగా...

కూతురు పుట్టాక నా జీవితం సరికొత్తగా మారింది. మా అక్క తర్వాత ఇంట్లో ఆడబిడ్డలు పుట్టిందే లేదు. అందుకే మరియమ్‌ (నా కూతురు) పుట్టగానే ఏకంగా మహాలక్ష్మీయే ఇంటికొచ్చినట్లు అందరం సంబరపడ్డాం. ఇప్పుడు తను ఇంట్లో అందరి ఫేవరెట్‌. తను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఇంట్లో అందరం గూగుల్‌లో వెతుకుతుంటాం. అలా తన నుంచి ప్రతీరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. ఇంట్లో నా కూతురితో కలిసి సరదాగా కార్టూన్‌ ఛానల్స్‌ చూస్తుంటా.

mag1.3.jpg

ఆ పదం నచ్చదు

పాన్‌ ఇండియా మూవీ అనే ట్యాగ్‌ వినీ విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా ఒక ఆర్టికల్‌ కూడా ఉండటం లేదు. నిజానికి పాన్‌ ఇండియా అనేది కొత్తగా వచ్చిందేమీ కాదు. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, షారుఖ్‌ ఖాన్‌... ఇలా ఎంతోమంది స్టార్స్‌ సినిమాలు దేశ, విదేశాలు దాటి ఆడాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్‌ ఇండియా సినిమా అని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సినిమాని సినిమా అంటే చాలు.


శృతి మించకుంటే చాలు...

అభిమానుల వల్ల ఇబ్బందిపడిన సందర్భాలు అనేకం. సినిమా ప్రచారంలో భాగంగా ప్రేక్షకుల వద్దకే వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ దగ్గరకు వచ్చి బుగ్గపై ముద్దు పెట్టాలని ప్రయత్నిస్తారు. అలా ఓసారి ఒక పెద్దావిడ వల్ల చాలా ఇబ్బందిపడ్డా. అయితే అభిమానుల కోసం ఇలాంటివి ఓర్చుకుంటాం. వాళ్లు కూడా శృతిమించకుంటే బాగుంటుంది.

ఆయనే నా హీరో

నాన్నే నా హీరో. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు, కథల గురించి ఇద్దరం చర్చించుకుంటాం. నేను ఎంచుకున్న కథలని సింగిల్‌ లైన్‌లో నాన్నకు చెబుతుంటా. నేను ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్నది ఆయన కోరిక. ‘అప్పట్లో నేను ఏడాదికి ఐదారు సినిమాలు చేసేవాడిని. నువ్వు కనీసం రెండు సినిమాలు కూడా చేయడం లేదు. ఇలా అయితే ఇంట్లోకి రానివ్వను’ అని నాన్న సరదాగా కోప్పడతారు. రజనీ సర్‌కి, తెలుగులో అల్లు అర్జున్‌కి వీరాభిమానిని.


దర్శకత్వం చేస్తా...

చిన్నప్పుడు షార్ట్‌ఫిల్మ్స్‌ తీసేవాడిని. అప్పటినుంచే దర్శకత్వంపై మక్కువ పెరిగింది. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. నా దర్శకత్వంలో సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఊహకు భిన్నంగా వుంటుంది. ఎప్పుడు, ఎవరితో తీస్తానన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను. కానీ అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని మాత్రం చెప్పగలను.

mag1.2.jpg

గ్యారేజీ నిండా కార్లే..

నాకు కార్లంటే విపరీతమైన పిచ్చి. మార్కెట్‌లోకి ఏదైనా కొత్త మోడల్‌ కారు దిగితే చాలు వెంటనే దాన్ని కొనేయాల్సిందే. కాస్త సమయం దొరికితే.. కార్లకు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటా. యూట్యూబ్‌లో గంటల తరబడి కార్లను ఆధునికీకరించే వీడియోలనే చూస్తుంటా. అలాగే పాత కార్లకి హంగులద్ది కొత్తగా మార్చేయడమంటే భలే ఇష్టం. అలా చేయించిన కార్లు నా గ్యారేజీలో బోలెడున్నాయి.

Updated Date - Sep 01 , 2024 | 08:18 AM