Share News

Viral: పాకిస్తాన్‌కు వెళ్లేందుకు మహిళ మాస్టర్ ప్లాన్.. చివరకు ఏమైందంటే?

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:58 PM

సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే మనుషుల మధ్య అనుసంధానం అనేది చాలా సులభతరం అయిపోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు..

Viral: పాకిస్తాన్‌కు వెళ్లేందుకు మహిళ మాస్టర్ ప్లాన్.. చివరకు ఏమైందంటే?
Viral

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే మనుషుల మధ్య అనుసంధానం అనేది చాలా సులభతరం అయిపోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు ఏర్పరుచుకుంటున్నారు. కొందరైతే ఆ అపరిచితులను కలవడం కోసం సరిహద్దులే దాటేస్తున్నారు. వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందుకోసం తప్పుడు మార్గాలను కూడా అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఓ మహిళ కూడా అదే పని చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలను ఉపయోగించి ఆమె పాకిస్తాన్‌కు వెళ్లిందని తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


మహారాష్ట్రలోని థానేకు చెందిన నగ్మా నూర్ మక్సూద్ అలీ అలియాస్ సనమ్ ఖాన్ అనే 23 ఏళ్ల మహిళకు పెళ్లయి ఓ కుమార్తె ఉంది. అయితే.. ఆమె పాకిస్తాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం పాస్‌పోర్ట్, వీసా అవసరం కాబట్టి.. వాటిని తయారు చేయించుకోవడం కోసం నకిలీ పత్రాలను సృష్టించింది. తొలుత తన పేరు మార్చుకొని.. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డును పొందింది. అలాగే.. థానేలోని లోకమాన్య నగర్ నుంచి తన కుమార్తె బర్త్ సర్టిఫికెట్ కూడా అందుకుంది. అనంతరం పాస్‌పోర్ట్ అప్లికేషన్‌తో ఆ నకిలీ పత్రాలను సమర్పించి.. ఎట్టకేలకు పాస్‌పోర్టు సంపాదించింది. ఆపై వీసా కూడా పొంది, తాను కోరుకున్నట్లుగానే పాకిస్తాన్‌కు వెళ్లిపోయింది. ఈ సంఘటన 2023 మే నుంచి 2024 మే మధ్య జరిగింది.


ఈ మొత్తం వ్యవహారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సనమ్‌కు సహకారం అందించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బహుశా ఆమెకు సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి పరిచయం అయ్యుంటాడని, అతడిని కలవడం కోసమే ఆమె అక్కడికి వెళ్లి ఉంటుందని తెలుస్తోంది. చట్టవిరుద్ధంగా ఆమె నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ సంపాదించి దాయాది దేశానికి వెళ్లినందుకు గాను సనమ్ ఖాన్ న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. పోలీసులు ఆమెతో పాటు గుర్తు తెలియని వ్యక్తిపై భారత పాస్‌పోర్ట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 04:58 PM