Share News

Viral: శ్మశానంలో తండ్రి సమాధి అకస్మాత్తుగా అదృశ్యం.. ఏం జరిగిందో తెలిసి కూతురు కన్నీరుమున్నీరు!

ABN , Publish Date - Apr 19 , 2024 | 08:27 PM

తండ్రి సమాధి అదృశ్యమవడంతో ఓ కూతురు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇలా చేస్తారని ముందే తెలిసుంటే తండ్రి మృతదేహాన్ని దహనం చేసి తన అస్తికలను తన వెంట తీసుకెళ్లేదాన్నని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Viral: శ్మశానంలో తండ్రి సమాధి అకస్మాత్తుగా అదృశ్యం.. ఏం జరిగిందో తెలిసి కూతురు కన్నీరుమున్నీరు!

ఇంటర్నెట్ డెస్క్: తండ్రి సమాధి అదృశ్యమవడంతో ఓ కూతురు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇలా చేస్తారని ముందే తెలిసుంటే తండ్రి మృతదేహాన్ని దహనం చేసి అస్తికలను తన వెంట తీసుకెళ్లేదాన్నని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బార్బడాస్‌లో (Barbados) వెలుగు చూసిన ఈ ఘటన స్తానికంగానే కాకుండా బ్రిటన్‌లో (Britain) కూడా కలకలానికి దారి తీసింది.

ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్‌లో నివసించే జోసెఫ్ లించ్ పోలీసు ఆఫీసర్‌గా చేసి రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తరువాత ఆయన బార్బడాస్ దేశానికి తన భార్యతో వెళ్లిపోయారు. జీవిత చరమాంకం ద్వీపదేశంలో సముద్ర తీరాన సంధ్యాసమయాలను వీక్షిస్తూ గడపాలనేది ఆ వృద్ధ దంపతుల ఆలోచన. బార్బడాస్ వెళ్లిన కొన్నేళ్లకు జోసెఫ్‌కు క్యాన్స్‌ర్‌ బారిన పడ్డారు. 2014లో కన్నుమూశారు. విషయం తెలిసి ఆయన ఐదుగురు పిల్లలు బార్బడాస్ చేరుకుని అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమయాత్రకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేద్దామనుకున్నారు గానీ ప్రభుత్వ జాప్యం కారణంగా అది కుదరలేదు.

అయితే, బంధువులందరూ కలిసి ఏలోటూ జరగకుండా జోసెఫ్‌కు తుది వీడ్కోలు పలికారు. బ్రిడ్జ్ టౌన్‌లోని వెస్ట్‌మిస్టర్ శ్మశానంలో ఆయన మృతదేహాన్ని ఖననం చేసి సమాధి నిర్మించారు. ఆ తరువాత చాలా ఏళ్ల పాటు కుటుంబసభ్యులు జోసెఫ్ వర్ధంతి సందర్భంగా బార్బడాస్‌కు వచ్చి సమాధి వద్ద నివాళులు అర్పించి వెళ్లేవారు. అయితే, కరోనా కారణంగా కొంత గ్యాప్ రావడంతో వారి జీవితం ఊహించని మలుపు తిరిగింది (Woman Shocked After Realising Father’s Grave Missing From Barbados Cemetery).

Viral: భార్యతో కలిసి విదేశీ టూర్‌.. ఇంటికొచ్చాక రూ.1.2 కోట్ల ఫోన్ బిల్లు చూసి షాక్!


కరోనా సంక్షోభం తరువాత జోసెఫ్ సమాధిని చూసేందుకు ఆయన కూతురు సూసెన్ తన భర్తతో పాటు వచ్చింది. కానీ, శ్మశానంలో ఉండాల్సిన తండ్రి సమాధి కనిపించకపోవడంతో ఆమెకు భారీ షాక్ తగిలింది. ఇలా జరుగుతుందని ఊహించలేక పోయిన ఆమె క్షణకాలం పాటు స్తంభించిపోయింది. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ సిబ్బందిని సుసెన్ తన తండ్రి సమాధి గురించి అడగ్గా దాన్ని తవ్వేశారని అతడు చెప్పాడు. ఐదేళ్ల తరువాత సమాధులను తవ్వి మిగిలిన అస్తికలను సమీపంలోని ఓ గోతిలో వేస్తామని అతడు చెప్పాడు. దీంతో, అక్కడికి వెళ్లిన సూసెన్ ఆ దృశ్యాన్ని చూసి షాకైపోయింది. ఓ గోతిలో మనుషుల కపాలాలు, ఎముకలు కుప్పగా పోసి ఉండటం ఆమె తట్టుకోలేక పోయింది. మృతులను, వారి జ్ఞాపకాలను ఇంతలా అవమానిస్తారా!? అంటూ కన్నీరుమున్నీరైంది.

ఆ తరువాత సూసెన్ అసలేం జరిగిందోనని వాకబు చేసింది. బార్బడాస్‌లో సాధరణంగా సమాధి కట్టిన ఐదేళ్లకు దాన్ని అస్తికలను మరో చోట ఉన్న ఓ గొయ్యిలో వేసేస్తారు. జర్మనీ, సింగపూర్ లాంటి దేశాల్లోనూ ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే, అంత్యక్రియలు సమయంలో తమకు ఎవరూ ఈ విషయాన్ని చెప్పలేదని సూసెన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తండ్రి జ్ఞపకాలు కూడా మిగలకుండా చేశారని కన్నీరుమున్నీరైంది. ఈ విషయం ముందే తెలిసుంటే తండ్రిని దహనం చేసి అస్తికలను తమ వెంట తీసుకుని వెళ్లి ఉండేవాళ్లమని చెప్పింది.

ఇలా మృతుల అస్తికలు ఒక చోట గొయ్యిలో కుప్పలా పోసి అందరికీ కనిపించేలా వదిలేయడం హేయమైన చర్య అని, మృతులను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేసింది. బ్రిటన్‌లోని ఓ కౌన్సిలర్ ద్వారా న్యాయం కోసం పోరాడిన ఆమెకు బార్బడాస్ ప్రభుత్వం చివరకు క్షమాపణలు చెప్పింది. అయితే, తనకు ఎవరి క్షమాపణలూ వద్దన్న సూసెన్.. బార్బడాస్ ప్రభుత్వం ఈ హేయమైన చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తోంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 19 , 2024 | 08:38 PM