Share News

Hardik Pandya: కెప్టెన్సీ వివాదంలో కొత్త ట్విస్టు.. అదే హార్దిక్ పాండ్యా కొంపముంచింది

ABN , Publish Date - Jul 21 , 2024 | 03:43 PM

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించకపోవడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడు అతడేనని అంతా ఫిక్సైన తరుణంలో..

Hardik Pandya: కెప్టెన్సీ వివాదంలో కొత్త ట్విస్టు.. అదే హార్దిక్ పాండ్యా కొంపముంచింది
Hardik Pandya

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) కెప్టెన్‌గా నియమించకపోవడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ (Rohit Sharma) వారసుడు అతడేనని అంతా ఫిక్సైన తరుణంలో.. సూర్యకుమార్‌ను (Suryakumar Yadav) టీ20 సారథిగా, శుభ్‌మన్ గిల్‌ను (Shubman Gill) వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హార్దిక్‌ను ఎందుకు పక్కకు తప్పించారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే.. ఫిట్‌నెస్ వల్లే అతడ్ని ఎంపిక చేయలేదని కొందరు, శ్రీలంకతో వన్డేలకు దూరంగా నిర్ణయించుకోవడం వల్లే పాండ్యాకు పగ్గాలు అప్పగించలేదని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


అయితే.. ఇప్పుడు ఈ వ్యవహారంలో సరికొత్త ట్విస్టు వెలుగు చూసింది. పాండ్యాకు కెప్టెన్సీ దక్కకపోవడం వెనుక ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో (Guatam Gambhir) పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పాత్ర కూడా ఉందని తెరమీదకి వచ్చింది. పాండ్యా కెప్టెన్సీపై ఆయనకు పూర్తి నమ్మకం లేదని, అందుకే అతనిని పక్కకు తప్పించారని సమాచారం. ఓ అంతర్జాతీయ కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణాలు, సామర్థ్యం పాండ్యాలో లేవని సెలక్షన్ టీమ్ భావించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన మార్క్ చూపించకపోవడం, పూర్తిగా ఫెయిల్ అవ్వడమే పాండ్యా కొంపముంచినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పాండ్యాపై తీవ్ర విమర్శలు రావడంతో.. అతని కెప్టెన్సీ స్కిల్స్‌పై అగార్కర్ సంతృప్తిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి.


అంతేకాదు.. డ్రెస్సింగ్ రూమ్‌లో పాండ్యా ప్రవర్తన కన్నా సూర్యకుమార్ ప్రవర్తన బాగుంటుందని సహచర ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాండ్యా వ్యవహరించే తీరుతో పోలిస్తే సూర్య చాలా సున్నితంగా ఉంటాడని.. అందుకే సూర్యకే కెప్టెన్సీ ఇప్పించాలని అందరూ తమ మద్దతు తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. పాండ్యా తన ఆల్‌రౌండ్ ప్రదర్శన సత్తా చాటాల్సిందేనని అనిపిస్తోంది. ఇదే అతని ముందున్న అతిపెద్ద సవాల్‌లాగా కనిపిస్తోంది. బ్రేకులు తీసుకోకుండా.. ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి సారించి.. తన విశ్వరూపం చాటాలి. అప్పుడే.. జట్టులో అతని స్థానానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. లేకపోతే.. ఏమైనా జరగొచ్చని క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 03:43 PM