MS Dhoni: ధోనీ 9వ స్థానంలో రావడానికి కారణమిదే.. విమర్శకులకు కౌంటర్
ABN , Publish Date - May 07 , 2024 | 04:54 PM
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 16వ ఓవర్‌లో 122 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయినప్పుడు ధోనీ వస్తాడని..
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 16వ ఓవర్‌లో 122 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయినప్పుడు ధోనీ వస్తాడని అందరూ ఆశిస్తే.. అందుకు భిన్నంగా శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) రంగంలోకి దిగడం అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. ధోనీ తనకన్నా ముందు శార్దూల్‌ని ఎందుకు పంపించాడంటూ ప్రశ్నల వర్షం కురిసింది. ఇక హర్భజన్ సింగ్ (Harbhajan Singh) అయితే తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. జట్టుకి పరుగులు అవసరమైన పరిస్థితిలో బ్యాటింగ్‌కు రాలేనప్పుడు.. ధోనీ జట్టు నుంచి తప్పుకొని, మరో బౌలర్‌ని ఆడించాల్సిందంటూ ధ్వజమెత్తాడు.
రోహిత్ ఇంగ్లీష్ విని నవ్వుకునే వాళ్లం.. అతడిని ప్రపంచకప్‌తో చూడాలనుంది
ఇలా ధోనీపై వస్తున్న విమర్శలపై చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వర్గాలు స్పందిస్తూ.. లోయర్ ఆర్డర్‌లో అతను బ్యాటింగ్‌కు రావడానికి గల కారణాలను వెల్లడించాయి. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ తొడ కండర గాయంతో బాధపడుతున్నాడని, ఆ గాయంతోనే అతడు ఆడుతున్నాడని తెలిపాయి. ‘‘జట్టు రెండో వికెట్ కీపర్ డేవిడ్ కాన్వే కూడా గాయం బారిన పడటంతో.. తప్పనిసరి స్థితిలో ధోనీనే బాధని ఓర్చుకొని, మైదానంలోకి దిగాల్సి వస్తోంది. ఓవైపు మందులు వాడుతూనే, మరోవైపు తక్కువ పరిగెత్తేలా జాగ్రత్తలు తీసుకుంటూ ధోనీ ఆడుతున్నాడు. నిజానికి.. డాక్టర్లు ధోనీని విశ్రాంతి తీసుకోమని చెప్పారు కానీ, కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవ్వడంతో ధోనీనే నిలబడాల్సి వస్తోంది. ధోనీని విమర్శించే వారికి అతడు జట్టు కోసం చేస్తున్న త్యాగం గురించి తెలియకపోవచ్చు’’ అని సీఎస్కే వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలావుండగా.. గతే ఐపీఎల్ సీజన్‌లో కూడా ఎంఎస్ ధోనీ మోకాలి గాయంతోనే ఆడాడు. ఆ గాయంతోనే జట్టుకి కప్పు అందించాడు. ఇప్పుడు ఆ గాయం నయమైంది కానీ, కండర గాయం మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. అది మరింత తీవ్రం అవ్వకుండా ఉండేందుకు.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. పరుగులు పెట్టడం ఇబ్బందికరంగా ఉంటోంది కాబట్టి.. భారీ షాట్లు బాదడంపైనే ధోనీ దృష్టి సారించాడు. రుతురాజ్‌కు జట్టు పగ్గాలు అప్పగించినా.. అతనికి మార్గదర్శిగా వ్యవహరిస్తూ, జట్టులో అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
Read Latest Sports News and Telugu News