DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. ముంబై ముందు భారీ లక్ష్యం
ABN , Publish Date - Apr 27 , 2024 | 05:33 PM
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత కోసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన జేక్ ఫ్రేసర్ మెగ్‌గుర్క్ (84) విధ్వంసం సృష్టించడంతో పాటు..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత కోసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన జేక్ ఫ్రేసర్ మెగ్‌గుర్క్ (84) విధ్వంసం సృష్టించడంతో పాటు స్టబ్స్ (48), హోప్ (41), రిషభ్ పంత్ (29) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ఢిల్లీ జట్టు ముంబైకి 258 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఢిల్లీ ఓపెనర్లు జేక్ ఫ్రెసర్, అభిషేక్ పోరెల్ రావడంతో రావడంతో దూకుడుగా ఆడారు. ముఖ్యంగా.. జేక్ ఫ్రేసర్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అదేదో ముంబై జట్టుపై జన్మజన్మల శతృత్వం ఉందన్నట్టు.. బౌండరీల ప్రళయం సృష్టించాడు. ఆఖరికి ముంబై స్టార్ పేసర్ బుమ్రాకి సైతం అతడు చెమటలు పట్టించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం చేశాడంటే.. ఏ రేంజ్‌లో ఉతికారేశాడో మీరే అర్థం చేసుకోండి. ఓవరాల్‌గా అతడు 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సులతో 84 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ (27 బంతుల్లో 36) పర్వాలేదనిపించాడంతే. వీళ్లిద్దరు కలిసి తొలి వికెట్‌కి 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇక ఆ తర్వాత వచ్చిన హోప్ (17 బంతుల్లో 41) సైతం ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ రిషభ్ పంత్‌తో పాటు స్టబ్స్ కూడా చెలరేగి ఆడటంతో.. ఢిల్లీ జట్టు 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ముంబై బౌలర్లలో దాదాపు ప్రతి ఒక్కరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వుడ్, బుమ్రా, చావ్లా, నబీ తలా ఒక వికెట్ పడగొట్టారంతే. మరి.. 258 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై జట్టు ఛేధించగలుగుతుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!