Share News

India vs South Africa: చరిత్రలో ఇదే మొదటిసారి.. భారత్‌దే పైచేయి!

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:08 PM

టీ20 వరల్డ్‌కప్ 2024 తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్..

India vs South Africa: చరిత్రలో ఇదే మొదటిసారి.. భారత్‌దే పైచేయి!
India vs South Africa

టీ20 వరల్డ్‌కప్ 2024 (T20 World Cup 2024) తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ జరగనుంది. అయితే.. ఈ టోర్నీలో మునుపెన్నడూ చూడని ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఫైనల్స్‌కు చేరిన రెండు జట్లు.. ఈ టోర్నీలో ఒక్కటంటే ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. గ్రూప్ దశ, సూపర్-8లలో ఇవి అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయఢంకా మోగించాయి. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. అజేయంగా ఫైనల్స్‌కు దూసుకొచ్చాయి. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రెండు జట్లు ఇలా అజేయంగా ఫైనల్స్‌కి చేరడం ఇదే తొలిసారి.


అంతేకాదు.. టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలో ఇప్పటివరకూ ఒకే ప్రత్యర్థులు ఫైనల్స్‌కి చేరిన దాఖలాలు లేనే లేవు. ప్రతిసారి డిఫరెంట్ జట్లే ఫైనల్స్‌కు చేరాయి. తొలుత 2007 ఎడిషన్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం 2009లో పాకిస్తాన్ vs శ్రీలంక, 2010లో ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, 2012లో వెస్టిండీస్ vs శ్రీలంక, 2014లో శ్రీలంక vs భారత్, 2016లో వెస్టిండీస్ vs ఇంగ్లండ్, 2021లో ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, 2022లో ఇంగ్లండ్ vs పాకిస్తాన్ జట్లు తలపడటం జరిగింది. 2024 ఎడిషన్‌లో భారత్, సౌతాఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. తొలిసారి ఫైనల్స్‌కి చేరుకోవడంతో సౌతాఫ్రికా ఎలాగైనా టైటిల్ కొట్టాలని భావిస్తోంది. అటు.. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేకులు వేయాలని భారత్ కసి మీద ఉంది. దీంతో.. ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


ఇకపోతే.. భారత్, సౌతాఫ్రికా జట్లు ఈ పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకూ 26 సార్లు తలపడ్డాయి. 18 ఏళ్ల క్రితం జోహనెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో.. భారత జట్టే గెలుపొందింది. మొత్తం మీద చూసుకుంటే.. భారత్ 14, సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. అంటే.. ఇరుజట్ల మధ్య జరిగిన పోరాటాల్లో భారత్‌దే పైచేయి ఉంది. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే.. మొత్తం ఆరుసార్లు ఇరు జట్లు తలపడగా.. భారత్ 4, సౌతాఫ్రికా 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. మరి.. అదే ఆధిపత్యాన్ని ఫైనల్ పోరులోనూ భారత్ కొనసాగిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 29 , 2024 | 05:21 PM