Gautam Gambhir: అన్నింటికన్నా అదే ముఖ్యం.. హెడ్ కోచ్ వార్తలపై గంభీర్ క్లారిటీ
ABN , Publish Date - Jun 03 , 2024 | 03:17 PM
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫమ్ అయ్యాడని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన..
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) దాదాపు కన్ఫమ్ అయ్యాడని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన హై-ప్రొఫైల్ యజమాన్ని ఈ విషయాన్ని ధృవీకరించాడని క్రిక్‌బజ్ సైతం నివేదించింది. అయితే.. గంభీర్ మాత్రం ఈ వార్తలపై స్పందించకుండా మౌనం పాటిస్తూ వస్తున్నాడు. ఎట్టకేలకు ఇన్నిరోజుల తర్వాత అతను ఈ విషయంపై మౌనం వీడాడు. భారత జట్టుకి కోచింగ్ చేయడం కన్నా గొప్ప గౌరవం ఏదీ లేదని పేర్కొన్నాడు. అబు ధాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆ కార్యక్రమంలో ఒక స్టూడెంట్ కోచింగ్ వార్తలపై సంధించిన ప్రశ్నకు గంభీర్ బదులిస్తూ.. ‘‘ఇప్పటివరకూ చాలామంది ఈ ప్రశ్న అడిగారు కానీ నేను సమాధానం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నీకు అందుకు జవాబిస్తాను. టీమిండియాకు కోచ్‌గా ఉండాలని నేను అనుకుంటున్నాను. జాతీయ జట్టుకి కోచ్ చేయడం కన్నా గొప్ప గౌరవం ఏదీ ఉండదు. ఎందుకంటే.. హెడ్ కోచ్ అంటే దేశంలో ఉన్న 140 కోట్ల మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయులకు ప్రాతినిథ్యం వహించడం వంటిది’’ అని చెప్పుకొచ్చాడు. 140 కోట్ల మంది భారతీయులే వరల్డ్‌కప్ గెలవడానికి భారత్‌కు సహకరిస్తారని అన్నాడు. అందరూ జట్టు కోసం ప్రారిస్థూ, ప్రాతినిథ్యం వహించడం మొదలుపెడితే.. భారత్ తప్పకుండా వరల్డ్‌కప్ గెలుస్తుందన్నాడు. నిర్భయంగా ఉండటమే అన్నింటికన్నా ముఖ్యమని పేర్కొన్నాడు.
ఇదే సమయంలో.. కేకేఆర్ మెంటార్ తాను పాటించిన సక్సెస్ మంత్రని సైతం గంభీర్ పంచుకున్నాడు. సెక్యూర్ డ్రెస్సింగ్ రూమ్ అంటే సంతోషకరమైన డ్రెస్సింగ్ రూమ్ అని, ప్లేయర్లందరూ ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంగలిగితేనే అది విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ అవుతుందని చెప్పాడు. తాను ఇదే మంత్రని కేకేఆర్ విషయంలో ఫాలో అయ్యానని, దేవుడి దయతో అది సక్సెస్ అయ్యిందని వెల్లడించాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. తాను హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడా? లేదా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా గంబీర్ సస్పెన్స్‌లో పడేశాడు.
Read Latest Sports News and Telugu News