Share News

Gautam Gambhir: రోహిత్, కోహ్లీల విషయంలో గంభీర్ యూ-టర్న్.. నీకిది తగునా?

ABN , Publish Date - Jul 25 , 2024 | 10:26 PM

ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టకముందు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో అతనెలా వ్యవహరిస్తాడోనని అందరికీ అనుమానాలు ఉండేవి. ఇద్దరు చాలా సీనియర్లు..

Gautam Gambhir: రోహిత్, కోహ్లీల విషయంలో గంభీర్ యూ-టర్న్.. నీకిది తగునా?
Gautam Gambhir

ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) బాధ్యతలు చేపట్టకముందు.. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీల (Virat Kohli) విషయంలో అతనెలా వ్యవహరిస్తాడోనని అందరికీ అనుమానాలు ఉండేవి. ఆ ఇద్దరు చాలా సీనియర్లు కావడం, కోహ్లీతో విభేదాలూ ఉండటంతో.. జట్టులో ఉండనిస్తాడా? లేదా? అనే చర్చలు జోరుగా సాగాయి. అయితే.. అలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని హెడ్ కోచ్ అయ్యాక గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. టీ20లకు వీడ్కోలు పలికిన ఆ ఇద్దరిలో ఇంకా చాలా క్రికెట్ దాగి ఉందన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఇప్పుడు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తికి కారణం అయ్యింది. కోచ్ అవ్వగానే గంభీర్ యూ-టర్న్ తీసుకున్నాడంటూ ఆయన విమర్శలు గుప్పించాడు.


రోహిత్‌కు కష్టమే

ఓ సందర్భంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌కి ముందు రోహిత్, కోహ్లీ మంచి ప్రదర్శన కనబరిస్తేనే నా జట్టులో ఉంటారని గంభీర్ వ్యాఖ్యానించాడు. కానీ.. ఇప్పుడు అతను యూ-టర్న్ తీసుకున్నాడు. ఆ ఇద్దరిని మించిన ఆటగాళ్లే లేరన్నట్లుగా పేర్కొంటున్నాడు. వారిలో చాలా క్రికెట్ మిగిలి ఉందనేలా మాట్లాడుతున్నాడు. ఆ ఇద్దరు ఫిట్‌గా ఉంటే.. 2027 వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఆడుతారని అంటున్నాడు. నేనైతే.. కోహ్లీ, రోహిత్‌ విషయంలో ఫిట్‌నెస్‌ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పగలను. విరాట్ చాలా ఫిట్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రోహిత్‌కు ప్లేయర్‌గా తిరుగులేదు. అయితే.. అతని వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. వన్డే వరల్డ్‌కప్ సమయానికి అతని వయసు 40కి చేరుతుంది. ధోనీ, సచిన్‌లా రోహిత్ సూపర్ ఫిట్‌ పర్సన్‌ అని నేను అనుకోవడం లేదు. ఈ వయసులో వరల్డ్‌కప్ ఆడటం అనేది అంత సులువు కాదు. కోహ్లీ కూడా అందుకు మినహాయింపు కాదు కానీ, అతడు చాలా ఫిట్‌గా ఉంటాడు. అందుకే రోహిత్ విషయంలో గంభీర్‌ తొందరపడ్డాడని భావిస్తున్నా. సౌతాఫ్రికాలో అతడు రాణించడం కష్టమే’’ అని చెప్పుకొచ్చాడు.


శ్రీలంక టూర్

ఇదిలావుండగా.. టీమిండియా ప్రస్తుతం శ్రీలంక టూర్‌కు సిద్ధమవుతోంది. జులై 27వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌లు చొప్పున.. ఆతిథ్య జట్టుతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడబోతోంది. ఈ పర్యటనతోనే గంభీర్ ప్రధాన కోచ్‌గా తొలిసారి తన బాధ్యతలను చేపట్టబోతున్నాడు. టీ20 మ్యాచ్‌లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మనే నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. నిజానికి.. టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలతో పాటు బుమ్రా విశ్రాంతి కావాలని కోరినట్లు వార్తలొచ్చాయి. శ్రీలంక టూర్‌లో వాళ్లు పాల్గొనకపోవచ్చని ప్రచారం జరిగింది. కానీ.. గంభీర్ అభ్యర్థన మేరకు రోహిత్, కోహ్లీ రంగంలోకి దిగారని తెలుస్తోంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 10:27 PM