Share News

BCCI: బీసీసీఐ సంచలన ప్రకటన.. అప్పటివరకు అతడే కెప్టెన్!

ABN , Publish Date - Jul 07 , 2024 | 02:47 PM

బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత జట్టుకి రోహిత్ శర్మనే నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని...

BCCI: బీసీసీఐ సంచలన ప్రకటన.. అప్పటివరకు అతడే కెప్టెన్!
BCCI Secretary Jay Shah

బీసీసీఐ కార్యదర్శి జై షా (Jay Shah) తాజాగా ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy 2025) భారత జట్టుకి రోహిత్ శర్మనే (Rohit Sharma) నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని స్పష్టం చేశాడు. రోహిత్ సారథ్యంలోనే భారత జట్టు ఆ టోర్నీలో తలపడనుందని వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (World Test Championship) ఫైనల్‌కు భారత్ చేరితే, అక్కడా రోహితే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని తెలిపాడు.


ఎక్స్‌లో బీసీసీఐ పోస్టు చేసిన వీడియోలో జై షా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ కెప్టెన్సీలో మేము డబ్ల్యూటీసీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తామని నమ్మకంగా ఉంది’’ అని అన్నాడు. ఇదే వీడియోలో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుని మరోసారి అభినందించాడు. ‘‘ఈ చారిత్రాత్మక విజయం కోసం నేను భారత జట్టుని అభినందించాలని అనుకుంటున్నా. ఈ విజయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, రవీంద్ర జడేజాలకు అంకితం చేయాలనుకుంటున్నా. గతేడాది జూన్‌లో మేము ప్రపంచ మనసుల్ని గెలవడంతో పాటు టీ20 వరల్డ్‌కప్ గెలుస్తామని చెప్పాను. నేను చెప్పినట్టు భారత్ ట్రోఫీ సాధించింది. ఇప్పుడు మా తదుపరి లక్ష్యం WTC ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.


కాగా.. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాదిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే.. భారత జట్టుని పాక్‌ను పంపిస్తారా? భారత జట్టు మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తారా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకోనుంది. మరోవైపు.. వచ్చే ఏడాది జూన్‌లో మూడో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌లో తలపడతాయి. భారత్ ఇప్పటికే రెండుసార్లు ఫైనల్స్‌కి వెళ్లింది కానీ, గెలవలేదు. కానీ.. ఈసారి తప్పకుండా గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 02:48 PM