Share News

Virat Kohli: పాకిస్తాన్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ అది తగ్గించుకుంటే మంచిది!

ABN , Publish Date - Jun 09 , 2024 | 08:14 AM

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగబోతోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా...

Virat Kohli: పాకిస్తాన్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ అది తగ్గించుకుంటే మంచిది!
Mohammed Kaif Suggestions To Virat Kohli

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఆదివారం మ్యాచ్ జరగబోతోంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఐసీసీ టోర్నీల్లో మినహాయిస్తే.. ఈ ఇరుజట్లు దశాబ్దకాలం నుంచి బైలాటరల్ సిరీస్‌లు ఆడలేదు కాబట్టి.. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో.. కొందరు మాజీలు భారత జట్టు ఆటగాళ్లు తమదైన సూచనలు ఇస్తున్నారు. తాజాగా మహమ్మద్ కైఫ్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఓ సలహా ఇచ్చాడు.

ప్రతి జట్టుకి కోహ్లీ ప్రమాదకరమే కానీ.. పాక్‌తో జరగబోయే మ్యాచ్‌లో అతను కాస్త దూకుడు తగ్గించుకుంటే మంచిదని కైఫ్ సూచించాడు. ప్రస్తుతం కోహ్లీ గొప్ప ఫామ్‌లో ఉన్నాడని, ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతనిని ఔట్ చేయడం అంత సులువు కాదని కొనియాడాడు. ఏదేమైనప్పటికీ.. కోహ్లీ తన దూకుడిని కొంచెం తగ్గించుకుంటే మంచిదని తాను భావిస్తున్నానని అన్నాడు. ఐర్లాండ్‌తో (Ireland) జరిగిన మ్యాచ్‌లో అతను ఐదు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేయడాన్ని కైఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. 140-150 స్ట్రైక్‌రేట్‌కి బదులుగా 130 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ తన ఆటని కొనసాగించాలని.. అనవసరమైన షాట్‌ల జోలికి వెళ్లొద్దని కోరాడు.


ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడని, పవర్‌ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడని కైఫ్ పేర్కొన్నాడు. అతను ఎలాంటి షాట్స్ అయినా ఆడగలడని, కానీ స్ట్రైక్‌రేట్‌ని కొంచెం తగ్గించాలని తాను భావిస్తున్నానని అభిప్రాయపడ్డాడు. అతను 130 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తే బెటరని.. ఎందుకంటే 15-20 ఓవర్ల మధ్య అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నాడు. డెత్ ఓవర్లలో అతను 60-70 పరుగులు రాణించగలడని.. అది జట్టుకి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని తెలిపాడు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా మెల్లగా తన ఇన్నింగ్స్ ప్రారంభించి.. ఆ తర్వాత తనదైన ఆటతో కోహ్లీ రాణించాలని కోరుకుంటున్నానని వెల్లడించాడు.

అంతేకాదు.. కోహ్లీ ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో వస్తేనే ఎంతో ఉత్తమమైనదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. అమెరికాలోని పిచ్ రిపోర్ట్‌ని బట్టి చూస్తే.. నంబర్ 3 అనేది కోహ్లీకి సరైన స్థానమని చెప్పాడు. మూడో స్థానంలో కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని, చివరివరకూ క్రీజులో నిలకడగా రాణించగలడని, మిడిల్ ఓవర్స్‌లో సమర్థవంతంగా ఆడగలడని చెప్పుకొచ్చాడు. మరి.. పాక్‌తో జరగబోయే ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లీ ఎలా రాణిస్తాడన్నది వేచి చూడాల్సిందే.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 08:14 AM