Share News

Natasa Stankovic: హార్దిక్‌తో విడాకుల వార్తలు.. నటాషా ఆసక్తికరమైన వీడియో

ABN , Publish Date - Jul 04 , 2024 | 04:31 PM

కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నటాషా తన ఇన్‌స్టా ఖాతాలోని..

Natasa Stankovic: హార్దిక్‌తో విడాకుల వార్తలు.. నటాషా ఆసక్తికరమైన వీడియో
Natasa Stankovic

కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యా (Hardik Pandya), నటాషా స్టాంకోవిచ్ (Natasha Stankovic) విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నటాషా తన ఇన్‌స్టా ఖాతాలోని పాండ్యా ఇంటి పేరు తొలగించడం, ఈమధ్య ఆ ఇద్దరు కలిసి కనిపించకపోవడం, సోషల్ మీడియా ఖాతాల్లోనూ తమ ఫోటోలు పెట్టకపోవడంతో.. విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. దీనికితోడు.. వాళ్లిద్దరు ఖండించకపోవడం కూడా ఆ రూమర్లకు మరింత బలం చేకూరుస్తోంది.


ఇలాంటి తరుణంలో.. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియో షేర్ చేసింది. జీవితంలో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడిపై నమ్మకం ఉంచాలని.. నిరాశపడుతూ కుంగిపోకూడదని ఆ వీడియోలో సందేశం ఇచ్చింది. ‘‘ఎట్టకేలకు నేను ఎన్నిరోజుల నుంచో వేచి చూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. నేను వినాలనుకున్న వార్త నాకు అందింది. అందుకే నేను ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. నాతో పాటు బైబిల్ కూడా తెచ్చుకున్నాను. ఇది చదివి మీకు వినిపించాలని అనుకుంటున్నాను’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వీడియోను ఆమె తన కారులో రికార్డ్ చేసింది.


నటాషా ఇంకా మాట్లాడుతూ.. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో ఏమాత్రం భయపడొద్దు. ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. నీతోనే ఉంటాడు. నిరుత్సాహంగా, విచారంగా, నిరాశగా అస్సలు ఉండొద్దు. నీ పరిస్థితిని చూసి ఆ దేవుడు ఆశ్చర్యపోడు. ఎందుకంటే ఆయన వద్ద అందుకు సంబంధించి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంటుంది’’ అని పేర్కొంది. అయితే.. తాను వినాలనుకున్న ఆ వార్తేంటో నటాషా రివీల్ చేయలేదు. తనకు ఓ శుభవార్త అందిందని చెప్పింది కానీ, అదేంటో బయటపెట్టకుండా సస్పెన్స్‌లో పడేసింది. దీంతో.. ఆ ఏమై ఉంటుందా? అని అందరూ చర్చించుకుంటున్నారు.


కాగా.. హార్దిక్, నటాషా 2020లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఐపీఎల్ సమయంలో పాండ్యాకు మద్దతుగా నటాషా ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడం.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచినప్పుడు కూడా భారత జట్టుని గానీ, హార్దిక్‌ని గానీ అభినందించకపోవడంతో.. వీరి విడాకుల వార్త మళ్లీ ఊపందుకుంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 04:31 PM