Share News

ICC T20I Rankings: శుభ్‌మన్ గిల్ భారీ జంప్.. టాప్-5 నుంచి పాండ్యా ఔట్

ABN , Publish Date - Jul 17 , 2024 | 08:17 PM

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మన యువ ఆటగాళ్లు దూసుకొచ్చారు. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. తమ ర్యాంక్‌లను మెరుగుపరచుకున్నారు.

ICC T20I Rankings: శుభ్‌మన్ గిల్ భారీ జంప్.. టాప్-5 నుంచి పాండ్యా ఔట్
ICC T20I Rankings

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో (ICC T20 Rankings) మన యువ ఆటగాళ్లు దూసుకొచ్చారు. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. తమ ర్యాంక్‌లను మెరుగుపరచుకున్నారు. ఈ సిరీస్‌లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అయితే భారీగా జంప్ కొట్టాడు. ఏకంగా 36 స్థానాలు ఎగబాకి.. 37వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో అతను మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 170 పరుగులు చేశాడు.


ఇక యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఆ సిరీస్‌లో ఆడింది చివరి మూడు మ్యాచ్‌లే అయినా.. అద్దిరిపోయే ప్రదర్శన కనబరచడంతో నాలుగు స్థానాలు ఎగబాకాడు. దీంతో.. ర్యాంకింగ్స్‌లో అతను 10వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో అతను 165.88 స్ట్రైక్‌రేట్‌తో 141 పరుగులు చేశాడు. అయితే.. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఒక స్థానం కోల్పోయి, 8వ స్థానంలో నిలిచాడు. కాగా.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఫిల్ సాల్ట్ కలిసి.. రెండో స్థానాన్ని పంచుకుంటున్నారు. జింబాబ్వే సిరీస్‌లో సూర్య భారత జట్టు తరఫున ఆడలేదు కాబట్టి.. అతని ర్యాంకింగ్ మారలేదు.


ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్ విషయానికొస్తే.. హార్దిక్ పాండ్యా టాప్-5 నుంచి వైదొలిగాడు. నిజానికి.. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత అతడు అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చడంలో వల్లే నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. కానీ.. కొన్ని రోజుల్లోనే శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా తిరిగి మొదటి స్థానానికి చేరుకోగా, హార్దిక్ రెండో స్థానానికి పడిపోయాడు. ఇప్పుడు అతను మరో నాలుగు స్థానాలు కోల్పోయి.. ఆరో స్థానానికి దిగజారిపోయాడు. ఒకవేళ అతను జింబాబ్వే సిరీస్‌లో భాగమై ఉండుంటే.. బహుశా అతని అగ్రస్థానం పదిలంగా ఉండేదేమో! అక్షర్ పటేల్ సైతం ఒక స్థానాన్ని కోల్పోయి.. 13వ ప్లేస్‌లో నిలిచాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 08:17 PM