Share News

Virat Kohli: దటీజ్ విరాట్ కోహ్లీ.. దెబ్బకు ఆల్‌టైం రికార్డ్

ABN , Publish Date - Jul 03 , 2024 | 01:38 PM

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికే అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్స్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను..

Virat Kohli: దటీజ్ విరాట్ కోహ్లీ.. దెబ్బకు ఆల్‌టైం రికార్డ్

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కేవలం మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ (Social Media) ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికే అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్స్ జాబితాలో (Most Followed Athletes) మూడో స్థానంలో ఉన్న అతను.. వ్యూస్, లైక్స్, కామెంట్ల పరంగా లెక్కలేనన్ని ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. తన అధికారిక ఖాతాల్లో ఏదైనా ఒక పోస్టు పెట్టాడంటే చాలు.. మిలియన్లలో వాటికి వ్యూస్, లైక్స్ వస్తుంటాయి. ఇప్పుడు అతనికి సంబంధించిన ఓ పోస్టు సోషల్ మీడియాను షేక్ చేసి, ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది.


ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత ఆటగాళ్లందరూ ఏ రేంజ్‌లో సంబరాలు జరుపుకున్నారో అందరూ చూశారు. చాలాకాలం నిరీక్షణ తర్వాత ట్రోఫీ గెలిచిన ఆనందంలో.. మైదానంలోనే స్టెప్పులు వేశారు. విరాట్ కోహ్లీ సైతం తన సహచరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. అంతే.. అది మొత్తం ఇన్‌స్టానే షేక్ చేసిపారేసింది. అది బాగా వైరల్ అయిపోయింది. దీంతో.. ఆ వీడియో ఇన్‌స్టా చరిత్రలోనే అత్యధిక వ్యూస్, లైక్స్ పొందింది. ఆ వీడియోని 126 మిలియన్ల మంది వీక్షించగా.. 9.7 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. ఫలితంగా.. ఐసీసీ ఇన్‌స్టా హిస్టరీలో అత్యధిక ఆదరణ పొందిన పోస్టుగా రికార్డులకెక్కింది.


అంతేకాదండోయ్.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విరాట్ కోహ్లీ పోస్టు చేసిన ఒక ఫోటోకు సైతం భారీ స్థాయిలో లైక్స్ వచ్చిపడ్డాయి. వరల్డ్‌కప్ ట్రోఫీని భారత జట్టు లిఫ్ట్ చేసిన ఫోటోని అతను షేర్ చేయగా.. దానికి 20 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో.. ఈ ఫీట్ సాధించిన తొలి ఏషియన్ అథ్లెట్‌గా కోహ్లీ చరిత్రపుటలకెక్కాడు. వరల్డ్‌వైడ్‌గా చూసుకుంటే.. ఐదో అథ్లెట్‌గా కోహ్లీ రికార్డ్ నెలకొల్పాడు. కాగా.. వరల్డ్‌కప్ గెలిచాక కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. అతను వన్డే, టెస్టు ఫార్మాట్లలో ఇంకొన్నాళ్లు కొనసాగుతాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లలో భారత జట్టులో భాగస్వామ్యం కానున్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 01:38 PM