Share News

Shubman Gill: భారత జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఎంపికైన తెలుగు కుర్రాడు

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:50 PM

ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో.. బీసీసీఐ ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెలలో జింబాబ్వేతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు..

Shubman Gill: భారత జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఎంపికైన తెలుగు కుర్రాడు
Shubman Gill

ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భారత జట్టు టైటిల్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో.. బీసీసీఐ (BCCI) ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెలలో జింబాబ్వేతో (Zimbabwe) జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు గాను భారత జట్టుని ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌లో యువ ఆటగాళ్లకే బీసీసీఐ అవకాశం కల్పించింది. అంతేకాదు.. ఈ జట్టుకి శుభ్‌మన్ గిల్‌ను (Shubman Gill) కెప్టెన్‌గా నియమించి ఆశ్చర్యపరిచింది.


నిజానికి.. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ (Hardik Pandya) పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్‌లలో (Suryakumar Yadav) ఎవరో ఒకరిని ఎంపిక చేయొచ్చని మొదట్లో ప్రచారం జరిగింది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు కాబట్టి.. హార్దిక్ లేదా సూర్యలలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రూమర్లు వినిపించాయి. కానీ.. బీసీసీఐ ఆ రూమర్లకు చెక్ పెట్టేసింది. హార్దిక్, సూర్యలకు కూడా రెస్ట్ ఇచ్చి.. జింబాబ్వే పర్యటనలో భారత జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్‌కు అవకాశం కల్పించింది. దీంతో.. కెప్టెన్ బాధ్యతలను అతను ఎలా నిర్వర్తిస్తాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఇప్పటికే ఐపీఎల్-2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి శుభ్‌మన్ గిల్ సారథిగా వ్యవహరించాడు. అయితే.. జట్టుని సమర్థవంతంగా నడిపించడంలో అతను విఫలం అయ్యాడు. అయినప్పటికీ.. బీసీసీఐ అతనిని జింబాబ్వే టూర్‌కి వెళ్లనున్న జట్టుకి కెప్టెన్‌గా నియమించడం గమనార్హం. ఇకపోతే.. ఈ జట్టులో వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్‌తో పాటు ధృవ్ జురేల్‌కు చోటు దక్కింది. రియాన్ పరాగ్, రుతురాజ్‌ గైక్వాడ్‌, నితీశ్ కుమార్ రెడ్డిలతో పాటు ఐపీఎల్‌-2024లో సత్తా చాటిన ఇతర యువ ఆటగాళ్లకు సైతం జట్టులో స్థానం లభించింది.


జింబాబ్వే టూర్‌కి భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 24 , 2024 | 07:49 PM