Share News

Rangareddy District : ఏసీబీ వలలో అదనపు కలెక్టర్‌

ABN , Publish Date - Aug 14 , 2024 | 05:13 AM

నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్‌ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే..

Rangareddy District : ఏసీబీ వలలో అదనపు కలెక్టర్‌

  • నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షల డిమాండ్‌

  • డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్‌ అసిస్టెంట్‌ను పురమాయించిన భూపాల్‌రెడ్డి

  • రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ నిర్వాకం.. రెడ్‌హ్యాండెడ్‌గా అసిస్టెంట్‌ పట్టివేత

  • ఆపై అదనపు కలెక్టర్‌నూ చాకచక్యంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

  • ఆయన నివాసంలో సోదాలు.. రూ.16 లక్షలు, ఆస్తి పత్రాల జప్తు?

  • సీనియర్‌ అసిస్టెంట్‌ను, ఆపై భూపాల్‌రెడ్డిని పట్టుకున్న ఏసీబీ అధికారులు

రంగారెడ్డి అర్బన్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్‌ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే.. ఏసీబీ అధికారులు అంతకుమించి చాకచక్యంగా వ్యవహరించి ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు భూపాల్‌రెడ్డితో పాటు కలెక్టరేట్‌ ఈ-సెక్షన్‌ అధికారి మదన్‌ మోహన్‌రెడ్డి కూడా పట్టుబడ్డారు.

హైదరాబాద్‌ నగర శివార్లలోని గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి చెందిన 14 గుంటల భూమి ధరణిలో నిషేధిత జాబితాలో ఉంది. దీన్ని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ పలుమార్లు రెవెన్యూ అధికారులకు ముత్యంరెడ్డి వినతి పత్రం ఇచ్చాడు. పని అవ్వకపోవడంతో ముత్యంరెడ్డి ఈ-సెక్షన్‌ అధికారి మదన్‌ మోహన్‌రెడ్డిని కలవగా ఆయన పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేశారు. చివరకు రూ. 8 లక్షలకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ లంచం వ్యవహారం గురించి ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి మదన్‌ మోహన్‌ను ముత్యంరెడ్డి కలిసి ఆ డబ్బు ఇచ్చారు.

అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు.. మదన్‌ మోహన్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దీన్ని ధ్రువీకరించుకునేందుకు తమ ముందే అదనపు కలెక్టర్‌కు ఫోన్‌ చేయాలంటూ ఏసీబీ అధికారులు ఆయన్ను ఆదేశించారు.


మదన్‌మెహన్‌ వెంటనే భూపాల్‌రెడ్డికి తన ఫోన్‌ నుంచి కాల్‌ చేశారు. గుర్రంగూడ భూమికి సంబంధించిన విషయంలో డబ్బు చేతికి అందిందని చెప్పగానే ఆ డబ్బు తీసుకుని పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వద్దకు రావాలని భూపాల్‌రెడ్డి సూచించారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మదన్‌మోహన్‌ను కారులో డబ్బుతో వెళ్లాలని ఆదేశించి.. ఆ వాహనాన్ని తమ కారులో అనుసరించారు. చెప్పిన చోటుకు వెళ్లి, అక్కడ రూ.8 లక్షలు అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డికి మదన్‌మోహన్‌ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

అక్కడి నుంచి భూపాల్‌రెడ్డి, మదన్‌మోహన్‌ను అర్ధరాత్రి కలెక్టరేట్‌కు తరలించారు. కాగా బాధితుడు ముత్యంరెడ్డి గతంలోనూ ఐదుగురు అధికారులను ఏసీబీకి పట్టించడం గమనార్హం. ఏబీసీ అధికారులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 10:30 వరకు కలెక్టరేట్‌లో రికార్డులను పరిశీలించారు. తట్టిఅన్నారం ఇందు అరణ్య హరితలోని అదనపు కలెక్టర్‌ విల్లాలో అధికారుల బృందం సోదాలు చేపట్టింది. ఈ మేరకు రూ.16 లక్షల నగదు, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసున్నట్లు సమాచారం. అనంతరం భూపాల్‌రెడ్డి, మదన్‌మోన్‌ ను అరెస్ట్‌ చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.


గతంలో మంత్రి ఓఎస్డీగా భూపాల్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఏసీబీకి చిక్కిన భూపాల్‌రెడ్డి గతంలో మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వద్ద ఓఎస్డీగా చేశారు. తరువాత భువనగిరి డివిజన్‌ పరిధిలోని బీబీనగర్‌, బొమ్మలరామారం, చౌటుప్పల్‌, యాదగిరిగుట్టలో తహసీల్దార్‌గా చేశారు. అనంతరం భువనగిరి ఆర్డీవోగా పనిచేశారు. అంతకు ముందు ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌గా, అనంతరం కలెక్టరేట్‌లో సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో గతంలోనూ ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ-సెక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి షాద్‌నగర్‌లో వీఆర్వోగా పనిచేశారు.

Updated Date - Aug 14 , 2024 | 05:13 AM