Share News

Yadagirigutta: గుట్ట మీద భక్తులకు 200 గదులు!

ABN , Publish Date - Sep 22 , 2024 | 04:15 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తున్న భక్తులకు గుట్ట మీద.. వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొత్తగా 200 గదులను నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది.

Yadagirigutta: గుట్ట మీద భక్తులకు 200 గదులు!

  • దాతల సహకారంతో నిర్మాణానికి ప్రతిపాదన

  • ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు

యాదాద్రి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తున్న భక్తులకు గుట్ట మీద.. వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో కొత్తగా 200 గదులను నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది. రాత్రి కొండపైనే బసచేసి, స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం వసతి గదులు నిర్మించాలన్న ప్రతిపాదనను దేవాదాయశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అనుమతించిన పక్షంలో దాతల సహకారంతో గదులు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలాలయం స్థానంలో, శివాలయం వెనుక ప్రాంతంలో దాదాపు 200 వరకు గదులు నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే గుట్ట మీద భక్తుల బసకు శాశ్వత ఏర్పాటు చేసినట్లవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రస్తుతం, గుట్టపైన హరిత హోటల్‌ గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి పరిమితంగా ఉండటంతో భక్తులు కొండ కింద బస చేయాల్సి వస్తోంది. తెల్లవారు జామున స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలంటే.. కొండ కింది నుంచి పైకి రావాలి. అయితే, ఉదయం వేళ బస్సులు సమయానికి రాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా గుట్ట పైనే పెద్ద సంఖ్యలో గదులు ఏర్పాటు చేస్తే భక్తుల ఇక్కట్లు తీరుతాయి. ఆలయ అభివృద్ధి పనులతోపాటు భక్తులకు సౌకర్యాలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో, సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు, కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో రాయిగిరిలో 20 ఎకరాల్లో రూ.43 కోట్లతో వేదపాఠశాలను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. యాదగిరిగుట్టలో పూజా కార్యక్రమాలకు పూలు, తులసీదళాలను బయటి నుంచి కొనకుండా దేవాలయ భూముల్లోనే వాటి పెంపకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది.


  • సత్రంలో నేలపైన కూర్చొని భోజనాలు

కొండ కింద నిర్మిస్తున్న అన్నదానసత్రం పనులు పూర్తి కాకపోవటంతో భక్తులు నేలపైన కూర్చొనే అన్నదాన ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం రూ.కోటి కేటాయించినట్లయితే అన్నదానసత్రం పనులు పూర్తవుతాయని సమాచారం. మరోవైపు, పెద్దగుట్టపై దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో వైటీడీఏ అతిథిగృహాన్ని నిర్మించి రెండేళ్లయినా.. ఇంకా ప్రారంభించలేదు. రాయిగిరి చెరువు వద్ద ఏర్పాటు చేసిన శిల్పారామం పనులు తుదిదశలో నిలిచిపోయాయి. ఇక, యాదగిరిగుట్టలో రూ.34 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈ ఫ్లైఓవర్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Sep 22 , 2024 | 04:15 AM