Share News

Hyderabad: ఫ్లోరైడ్‌ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:18 AM

ఫ్లోరైడ్‌ రక్కసిపై అలుపెరగని ఉద్యమాలు చేసిన అంశుల సత్యనారాయణ(75)మృతి చెందారు. నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో కన్నుమూశారు.

Hyderabad: ఫ్లోరైడ్‌ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి

  • 35 ఏళ్లుగా ఫ్లోరైడ్‌ సమస్యలపై పోరాటాలు

  • రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులకు అనేక వినతులు

  • నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో విషాదం

మర్రిగూడ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఫ్లోరైడ్‌ రక్కసిపై అలుపెరగని ఉద్యమాలు చేసిన అంశుల సత్యనారాయణ(75)మృతి చెందారు. నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో కన్నుమూశారు. సత్యనారాయణ క్షౌర వృత్తితో జీవనం సాగించేవారు. సత్యనారాయణకు వెంకటమ్మతో వివాహం కాగా తొలుత కుమార్తె జన్మించింది. పుట్టుకతోనే ఫ్లోరైడ్‌ బాధితురాలు కావటంతో ఆమె ఏడేళ్ల వయసులో మృతి చెందింది. కుమారుడు స్వామి కూడా పుట్టుకతో ఫ్లోరైడ్‌ బాధితుడు. మూడో సంతానమైన రాజేశ్వరికి ఫ్లోరైడ్‌ లక్షణాలు రాకపోవడంతో ఆమెకు వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు.


శివన్నగూడెం గ్రామస్థులు ఎనిమిది దశాబ్దాలుగా ఫ్లోరైడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. గ్రామంలో 4,370 మంది ఉండగా, 320మంది ఫ్లోరైడ్‌ పీడితులు ఉన్నారు. ఫ్లోరైడ్‌తో బాధపడుతూ 30 మంది మృతిచెందారు. కుమారుడు స్వామితో కలిసి 35 ఏళ్లుగా ఫ్లోరైడ్‌ రక్కసిపై వివిధ రూపాల్లో సత్యనారాయణ ఉద్యమించారు. ఫ్లోరైడ్‌ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ కంచుకుంట్ల సుభా్‌షతో కలిసి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఫ్లోరైడ్‌ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించగా.. 2021లో స్థల పరిశీలనకు వెళ్తూ మర్రిగూడకు వచ్చిన అప్పటి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన సత్యనారాయణ ఫ్లోరైడ్‌ బాధితుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.


ఇదిలా ఉండగా.. కుమారుడు స్వామి(37)అనారోగ్యంతో బాధపడుతూ 2022 జనవరిలో మృతిచెందడంతో సత్యనారాయణ మానసికంగా కుంగిపోయారు. అప్పటినుంచి నరాల సంబంధిత సమస్యతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన సత్యనారాయణ సోమవారం మృతి చెందారు. ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్‌ కంచుకంట్ల సుభాష్‌, జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, జిల్లా బాలల సమితి సభ్యుడు ఈద భాస్కర్‌ తదితరులు సత్యనారాయణ మృతదేహానికి నివాళులర్పించారు. ఫ్లోరోసిస్‌ సమస్య పరిష్కారానికి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ సేవలు మరువలేనివని, ఆయన మృతి ఫ్లోరైడ్‌ ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. సత్యనారాయణ భార్య వెంకటమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా, కుమార్తె, అల్లుడు ఆమె బాగోగులు చూసుకుంటున్నారు.

Updated Date - Oct 15 , 2024 | 04:18 AM