Share News

Akbaruddin Owaisi: కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా పథకాలా?

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:20 AM

రైతు రుణమాఫీ నుంచి ప్రతీ సంక్షేమ పథకం లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారని, కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చెయ్యకుండా పథకాలు అమలు చేయడమేంటనీ ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్‌ అసెంబ్లీలో ప్రశ్నించారు.

Akbaruddin Owaisi: కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా పథకాలా?

  • గణాంకాల్లో తేడాలు సభకే అగౌరవం

  • ఒకప్పుడు నేనూ, రేవంత్‌ స్నేహితులం

  • సభలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీ నుంచి ప్రతీ సంక్షేమ పథకం లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారని, కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చెయ్యకుండా పథకాలు అమలు చేయడమేంటనీ ఎంఐఎం ఎల్పీ నేత అక్బరుద్దీన్‌ అసెంబ్లీలో ప్రశ్నించారు. రేషన్‌ కార్డుల కోసమే ప్రజాపాలనకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, ప్రభుత్వం వెం టనే కొత్త కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీల కోసం ముందుండి పోరాడతానని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన అక్బరుద్దీన్‌.. బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమ లు చేయాలని కోరారు. అలాగే, ప్రభుత్వం బడ్జెట్‌లో చెప్పే గణాంకాలకు, వివిధ సర్వేలు, కాగ్‌ తదితర నివేదికల్లో ఉండే లెక్కలకు పొంతన ఉండడం లేదని విమర్శించారు.


బడ్జెట్‌ గణాంకాల్లో తేడాలు శాసనసభకే అగౌరవమని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ రూపకల్పనలో నిర్లక్ష్యం తగదని, గణాంకాల్లో తేడాలకు బ్యూరోక్రాట్లను బాధ్యులను చేసి అవసరమైతే వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం పదేపదే చెబితే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోతే 2014లో రూ.1.12 లక్షలున్న తలసరి ఆదాయం 2023 నాటికి 3.47 లక్షలకు ఎలా పెరిగిందని నిలదీశారు. బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు తగ్గాయని, దీనిపై అన్ని వర్గాలతో కలిసి పోరాడతానని ప్రకటించారు. పాతబస్తీ అభివృద్ధిని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లుల వసూలు బాధ్యతను పైలట్‌ ప్రాజెక్టు పేరిట అదానీ సంస్థకు అప్పగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ నియోజకవర్గాల్లో ఈ పని ఎందుకు చేయడం లేదని అడిగారు.


ఇక, టెండర్లు పిలవకుండా, ఎవరు పనులు చేపడతారో చెప్పకుం డా సీఎం రేవంత్‌ పాతబస్తీలో మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడం మంచి విషయమన్నారు. ముస్లింలకు ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనిడిమాండ్‌ చేశారు. వక్ఫ్‌భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో పోలీసుల సహకారంతోనే విచ్చలవిడిగా గంజా యి, డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని, అక్షరాస్యతలో రాష్ట్రం జాతీయ సగటు కంటే దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీఎం రేవంత్‌ రెడ్డి తాను మంచి స్నేహితులమని తెలిపారు. తమ స్నేహం 20 ఏళ్ల నాటిదని పేర్కొ న్నారు. తన స్నేహితుడైన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 03:20 AM