Investigation: వెటర్నరీ వర్సిటీలో నాటి నియామకాల్లో అక్రమాలు
ABN , Publish Date - Sep 22 , 2024 | 04:09 AM
పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 2021 నుంచి 2023 వరకు జరిగిన అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ డీజీ రీతూరాజ్‌కు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఫిర్యాదు చేశారు.
అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలపై ఆరోపణలు
మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని మానవతారాయ్ డిమాండ్
న్యాయవిచారణ జరిపించాలని ఏసీబీ డీజీకి ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 2021 నుంచి 2023 వరకు జరిగిన అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ డీజీ రీతూరాజ్‌కు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఫిర్యాదు చేశారు. ఈ నియామకాల్లో రోస్టర్, రిక్రూట్‌మెంట్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ. కోట్లలో అవినీతి చోటు చేసుకుందన్నారు. దీనిపై న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ రీతూరాజ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ అక్రమాలకు సంబంధించి మాజీ వీసీ, ప్రస్తుత, మాజీ రిజిస్ట్రార్లు, డీన్, సెలక్షన్ బోర్డు సభ్యులను బాధ్యులుగా చేసి విచారణ జరిపించాలని కోరారు. ఈ నియామకాలను రద్దు చేసి సీనియర్ ఐఏఎస్, అధికారుల పర్యవేక్షణలో మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాలని మానవతారాయ్ కోరారు. ఈ అవినీతికి మాజీ వీసీ రవీందర్‌రెడ్డి కారణమని, ఆయన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి స్వయానా వియ్యంకుడని, రవీందర్‌రెడ్డి అక్రమాలను నిరంజన్‌రెడ్డి కాపాడుతూ వచ్చారని ఓ ప్రకటనలో మానవతారాయ్ ఆరోపించారు.