Bomb Threat: ముంబై విమానానికి బాంబు బెదిరింపు
ABN , Publish Date - Oct 29 , 2024 | 05:02 AM
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి, ఇక్కడి నుంచి ముంబై బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండ్ అయింది.
హైదరాబాద్ విమానాశ్రయానికి ఆగంతకుడి ఫోన్
అక్కడి నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు సమాచారం
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ల్యాండింగ్
తనిఖీల తర్వాత బాంబు లేదని అధికారుల నిర్ధారణ
గోపాలపట్నం (విశాఖపట్నం), అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి, ఇక్కడి నుంచి ముంబై బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండ్ అయింది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు విశాఖ చేరుకుంది. తిరిగి 3:15 గంటలకు ముంబై బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉన్నట్టు ఆగంతకుడి నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి కాల్ వచ్చింది. దాంతో వారు విశాఖ విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు.
ఇక్కడి అధికారులు పైలట్‌కు సమాచారం అందించి, తిరిగి ల్యాండింగ్ చేయించారు. ప్రయాణికులందరినీ కిందకు దించి, భద్రతాదళ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్న తరువాత సాయంత్రం ఆరు గంటల సమయంలో విమానం తిరిగి ముంబై బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులంతా ఆందోళన చెందారు. ఇటీవల వరుసగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.