టీపీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Sep 15 , 2024 | 04:12 AM
టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
గాంధీభవన్‌లో సీఎం రేవంత్ చేతుల మీదుగా..
పాల్గొననున్న భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్ ఆదివారం గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు. అనంతరం గాంధీభవన్‌కు భారీ ర్యాలీగా వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్‌కు చేరుకోనున్న మహేష్ కుమార్ గౌడ్.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత 2.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఇందిరా భవన్ ముందు సభ జరగనుంది. కాగా.. టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి గాంధీభవన్‌లో చేసిన ఏర్పాట్లను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్‌కు స్వాగతం పలికేందుకు ఆదివారం పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌కు పెద్దఎత్తున రావాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మహేష్ కుమార్ గౌడ్ చర్యలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని శనివారం ఆయన నివాసంలో మహే్‌షకుమార్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు షబ్బీర్ అలీ శాలువా కప్పి అభినందించారు.