Job: నోటిఫికేషన్లకు బ్రేక్!
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:05 AM
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు రెండు నెలలపాటు బ్రేక్ పడనుంది. ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక వచ్చాకే కొత్తవి జారీ
హైకోర్జు మాజీ జడ్జితో ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్.. 60 రోజుల్లో నివేదిక సమర్పించేలా చర్యలు చేపట్టాలి
బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేకూ 2 నెలల గడువు.. బీసీ కమిషన్‌కు, ప్రణాళిక విభాగానికి సమన్వయకర్త
డిసెంబరు 9లోపు సర్వే పూర్తయితే వెంటనే స్థానిక ఎన్నికలు.. మంత్రులు, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు రెండు నెలలపాటు బ్రేక్ పడనుంది. ఎస్సీ కులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను నియామకాన్ని వెంటనే చేపట్టడంతోపాటు 60 రోజుల్లోనే కమిషన్ నివేదిక సమర్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు బీసీల సామాజిక, ఆర్థిక, కుల సర్వే నివేదికను కూడా 60 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ఎస్సీ కులాల వర్గీకరణ అమలు, బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కులాల వర్గీకరణలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని, వర్గీకరణకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఏకసభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. జ్యుడీషియల్ కమిషన్.. క్షేత్రస్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఉమ్మడి పది జిల్లాల్లో ఒక్కోరోజు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్గీకరణ అమలు, కులాల రీగ్రూపింగ్‌కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘానికి అందిన వినతులపై చర్చించారు. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న తీరు, హరియాణాలో తీసుకుంటున్న చర్యలను ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్.. ముఖ్యమంత్రికి వివరించారు.
బీసీ సర్వే పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికలు
రాష్ట్రంలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమీక్షలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వేపై బిహార్, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధికారులు సీఎంకు వివరించారు. కాగా, సర్వే చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం తమ వద్ద లేనందున దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్.. ముఖ్యమంత్రిని కోరారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. బీసీల సామాజిక, ఆర్థిక, కుల సర్వేకు రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని కేటాయిస్తున్నట్టు తెలిపారు. బీసీ కమిషన్, రాష్ట్ర ప్రణాళిక విభాగానికి సమన్వయకర్తగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కాగా బీసీల సామాజిక, ఆర్థిక, కుల సర్వేను 60 రోజుల్లోనే పూర్తిచేయాలని, డిసెంబరు 9లోపు నివేదికను సమర్పించాలని అన్నారు. ఈ సర్వే పూర్తయితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎస్సీల లెక్క ఇదీ..
ఎస్సీ కులాల వర్గీకరణ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీల జనాభా, వారి అక్షరాస్యత వివరాలను ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 54.08 లక్షల ఎస్సీ జనాభా ఉంది. మొత్తం జనాభాలో ఇది 15.45 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 75.40 శాతం, పట్టణ ప్రాంతాల్లో 24.60 శాతం చొప్పున ఎస్సీలు ఉన్నారు. ఇక రాష్ట్రంలో సాధారణ అక్షరాస్యత 66.54 శాతంగా ఉంటే.. ఎస్సీల అక్షరాస్యత 58.90 శాతం ఉంది. అంటే సాధారణం కంటే ఎస్సీలు 8.64 శాతం తక్కువ అక్షరాస్యతలో ఉన్నారు. కాగా, సాధారణ మహిళల అక్షరాస్యత రేటు 57.99 శాతం ఉండగా.. ఎస్సీ మహిళల అక్షరాస్యత రేటు 49.90 శాతంగా ఉంది.
సాధారణ మహిళల కంటే ఎస్సీ మహిళలు 8.09 శాతం తక్కువ అక్షరాస్యతతో ఉన్నారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. వీటిలో ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలు 19, ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ స్థానాలు 3 ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా.. 769 గ్రామపంచాయతీల్లో దాదాపు 40 శాతానికి పైగా ఎస్సీ జనాభా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 620 రెవెన్యూ మండలాలు ఉండగా.. 340 మండలాల్లో దాదాపు 40 శాతానికి పైగా ఎస్సీ జనాభా ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
ఎల్ అండ్ టీ విరాళం రూ. 5.50 కోట్లు
ముఖ్యమంత్రి సహాయనిధికి ఎల్ అండ్ టీ సంస్థ.. రూ. 5.50 కోట్ల విరాళం ఇచ్చింది. సచివాలయంలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కలను కలిసిన ఆ సంస్థ చైర్మన్.. వారికి చెక్కును అందజేశారు.
మహిళలకు సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
రాష్ట్రంలోని మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలతో రూపొందించే ఘనమైన బతుకమ్మలతో ఆడిపాడే సంబురాల్లో ఆఖరి రోజైనా సద్దుల బతుకమ్మను వైభవంగా జరుపుకోవాలని సూచించారు. పెద్ద బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌బండ్‌తో పాటు రాష్ట్రంలోని చెరువులన్నింటి వద్ద ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి సైతం మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.