Share News

KTR: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ పోరాటం.. ఎల్లుండి ధర్నాకు పిలుపు

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:28 PM

తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన రుణ మాఫీపై ఇంకా రాద్ధాంతం నడుస్తూనే ఉంది. 40 శాతం మందికి రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. ఆధార్, బ్యాంక్ అకౌంట్లు లాంటి సమస్యలతో నిలిచిపోయిన విషయం వాస్తవమేనని రేవంత్ సర్కార్ చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎల్లుండి (ఆగస్టు-22న) రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిచ్చింది...

KTR: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ పోరాటం.. ఎల్లుండి ధర్నాకు పిలుపు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన రుణ మాఫీపై (Rythu Runamafi) ఇంకా రాద్ధాంతం నడుస్తూనే ఉంది. 40 శాతం మందికి రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ (BRS) ఆరోపిస్తుండగా.. ఆధార్, బ్యాంక్ అకౌంట్లు లాంటి సమస్యలతో నిలిచిపోయిన విషయం వాస్తవమేనని రేవంత్ సర్కార్ (Revanth Govt) చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎల్లుండి (ఆగస్టు-22న) రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిచ్చింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22న మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నాకు దిగుతోంది. ధర్నాకు సంబంధించి ఈ కీలక ప్రకటనను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు.


KTR.jpg

ఆగదు.. ఆగదు..!

తెలంగాణలో 40 శాతం మంది రైతన్నలకు రుణమాఫీ జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తయిందని చెబుతున్నారు. మంత్రులు తలా ఓ మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారు. అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలి. అప్పటిదాకా ప్రభుత్వం పైన మా పోరాటం ఆగదు. అందులో భాగంగానే ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాంఅని కేటీఆర్ ప్రకటించారు.


Harish-rao-revanth-Reddy.jpg

తలాతోక లేకుండా..!

రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రేమో రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బా కొడుతున్నారని.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదంటున్నరని అన్నారు. మొన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ.18వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటించారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తికాలేదని.. ఇంకా 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామన్నారని తెలిపారు. మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారన్నారు. ఇక ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే పచ్చి అబద్దం చెప్పారని అన్నారు. ఏకంగా 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారని.. ఏది నిజం. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. ఒకవైపు రుణమాఫీ కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారన్నారు. భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 20 , 2024 | 04:28 PM